రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో వేరుశనగ పంట దిగుబడులు వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదివారం కురిసిన వర్షంతో యార్డులోకి తీసుకొచ్చిన వేరుశనగ బస్తాలు తడిసి రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. మార్కెట్ యార్డులో పంట నిల్వ కోసం తగిన షెడ్లు లేకపోవడం వల్ల పంట ఉత్పత్తులకు రక్షణ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల నుంచి రైతులు తమ వేరుశనగ దిగుబడులను అమ్మకానికి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు తరలించారు. మొత్తం 15,757 బస్తాల్లో 4,727 క్వింటాళ్ల వేరుశనగను ఆదివారం విక్రయానికి తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. క్వింటాకు గరిష్టంగా రూ.8,540 చొప్పున కొనుగోలు జరుగుతున్నట్లు సమాచారం.
అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం కురవడంతో యార్డులో ఆరబోసి ఉంచిన వేరుశనగ బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షపు నీరు యార్డులో నిల్వ ఉండటంతో పాటు డ్రైన్ నీరు వెనక్కు వచ్చి పంట బస్తాల్లోకి చేరింది. దీంతో పలువురు రైతుల బస్తాలు నీటిలో మునిగిపోయి పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు కొంత భాగం కొట్టుకుపోయినట్లు అక్కడి రైతులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఒక రైతు తన వేదనను వ్యక్తం చేస్తూ, డ్రైన్ నీరు తిరిగి వచ్చి తన వేరుశనగ బస్తాలు నీటిలో మునిగిపోయాయని తెలిపాడు. తనకు చెందిన 12 సంచులకు పైగా నీటిలో కొట్టుకుపోయాయని, ఈ నష్టాన్ని భరించే స్థోమత లేదని ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడని అక్కడి రైతులు వివరించారు.
మార్కెట్ యార్డులో పంట రక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి సీజన్‌లో వర్షాలు కురిసే సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. వర్షాల కాలంలో పంటలకు రక్షణ కల్పించేలా షెడ్లు నిర్మించాలని, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.













