రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్ నేతృత్వంలో కొనసాగుతున్న యుద్ధం, అమెరికా కవ్వింపు చర్యల ప్రభావంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. సెప్టెంబర్ 14న క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 128.70 అమెరికన్ డాలర్లకు చేరుకోవడంతో గ్లోబల్ మార్కెట్లలో కలకలం రేగింది. బ్యారెల్‌కు 100 అమెరికన్ డాలర్లకు పైగా క్రూడ్ ధరలు, 5 శాతం దాటిన అమెరికా బాండ్ లాభాలు ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 15న భారతీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) 5 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. మూడు నెలల కనిష్ట స్థాయికి మార్కెట్ క్యాప్ చేరిందని బీఎస్‌ఈ రిపోర్ట్ ఆధారంగా ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన వార్తలో వెల్లడైంది.
బీఎస్‌ఈ తాజా రిపోర్ట్ ప్రకారం, లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.92 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. జూన్ 11 తర్వాత నమోదైన అతి తక్కువ స్థాయి ఇదే. ఏడాది ప్రారంభంలో 5.3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ విలువ, ఇప్పటివరకు దాదాపు 380 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర క్షీణించింది. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందనే భయాలతో సెప్టెంబర్ 15న బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల U.S. Treasury లాభాలు 5.041 శాతానికి చేరుకున్నాయి. 2007 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. గ్లోబల్ మార్కెట్ క్యాప్‌లో భారతదేశం వాటా 2.95 శాతానికి పడిపోయింది. జూన్ 3 తర్వాత ఇదే కనిష్టం.
మంగళవారం సెన్సెక్స్ 778 పాయింట్లు నష్టపోయి 74,003.81 వద్ద ముగిసింది. జూన్ 11 తర్వాత ఇదే అతి తక్కువ స్థాయి. నిఫ్టీ 280 పాయింట్లు (1.2 శాతం) పడిపోయి 23,118.60 వద్ద స్థిరపడింది. ఏప్రిల్ 6 తర్వాత ఇంత తక్కువ స్థాయికి ఇప్పుడు చేరింది.
చమురు ధరల ఎగసిపాటు, ద్రవ్యోల్బణం మళ్లీ వేగం పుంజుకుంటుందనే ఆందోళనలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు భారీగా రుణాలు తీసుకోవడం వల్ల బాండ్‌లపై లాభాలు పెరుగుతున్నాయని స్టెప్ ట్రేడ్ కాపిటల్ డైరెక్టర్, ఫండ్ మేనేజర్ క్రిషా గుప్తా ఎకనామిక్ టైమ్స్‌కు తెలిపారు. రూపాయి విలువ పడిపోవడం, రెపో రేటు పెరుగుతుందనే అంచనాలు కూడా పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
ముడి చమురు ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్‌కు 109.76 అమెరికన్ డాలర్లుగా నమోదైందని ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ వివరించింది. జులైలో బ్యారెల్‌కు 82.04 డాలర్లు ఉండగా, ఆగస్టులో 90.19 డాలర్లకు పెరిగింది. సెప్టెంబర్‌లో ధరలు మరింత ఎగిసి, జులై సగటుతో పోలిస్తే సుమారు 43 శాతం ఎక్కువగా ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో భారతీయ ఈక్విటీలు కొంతకాలం బలహీనంగానే ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
“క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్ట స్థాయిలో ఉండటం, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు, అమెరికా Federal Reserve పాలసీ నిర్ణయానికి ముందు ఉన్న అనిశ్చితి కారణంగా భారతీయ ఈక్విటీలు బలహీనంగా ఉండే అవకాశం ఉంది”
అని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వెల్త్ మనగెమెంత్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది.






