దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభ గంటలోనే కీలక సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, వడ్డీ రేట్లపై ఆందోళనలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లోని ప్రధాన సూచీ నిఫ్ట్య్ 71 పాయింట్లు పడిపోయి 24,325 స్థాయికి చేరింది. ఇదే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ 291 పాయింట్లు నష్టపోయి 77,783 వద్ద ట్రేడవుతోంది. ప్రారంభ నిమిషాల్లోనే విస్తృత మార్కెట్ సూచీల్లోనూ బలహీనత కనిపించింది.

అంతర్జాతీయ మార్కెట్ల పరంగా చూస్తే, అమెరికా డాలర్ ఇండెక్స్ 99.92 వద్ద కొనసాగుతోంది. ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 87 డాలర్లకు చేరింది. ముడి చమురు ధరల పెరుగుదల దిగుమతి ఆధారిత దేశాలైన భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అమెరికా ప్రభుత్వ బాండ్‌లపై ఈల్డ్‌లు కూడా ఎగబాకాయి. US 10- ఇయర్ బాండ్ Yield 4.65 శాతానికి చేరింది. దీర్ఘకాలిక బాండ్‌లపై ఈల్డ్‌లు పెరగడం, ప్రపంచవ్యాప్తంగా రిస్కీ ఆస్తులైన ఈక్విటీలపై పెట్టుబడిదారుల ఆసక్తిని తగ్గించే అంశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే, గడిచిన ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. US S&P సూచీ 0.65 శాతం, నాస్డాక్ 0.81 శాతం మేర పెరిగాయి. అమెరికా మార్కెట్లలో నమోదైన ఈ లాభాలు ఆసియా మార్కెట్లకు కొంత మద్దతు ఇవ్వగలిగినా, స్థానిక అంశాలు, ముడి చమురు ధరల ఒత్తిడి, బాండ్ ఈల్డ్‌ల పెరుగుదల భారత మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

రోజంతా దేశీయ సూచీలు ఎలా కదలాడతాయన్న దానిపై పెట్టుబడిదారుల దృష్టి నిలిచింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ రంగాల షేర్లలో జరిగే మార్పులు సూచీల దిశను నిర్ణయించే అవకాశం ఉందని బ్రోకరేజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.