స్మగ్లింగ్ నేపథ్యంలోని ‘కాటాలన్’ – బోర్ కొట్టించిన యాక్షన్ డ్రామా

మలయాళం చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని అక్కడి మూవీ మేకర్స్ తమ సినిమాలను వరుసగా తెలుగులో డబ్ చేస్తున్నారు. అదే తరహాలో మలయాళం చిత్రం కాటాలన్ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆంటోనీ వర్గీస్ హీరోగా, దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో తెలుగు నటుడు, కమెడియన్ సునీల్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

కర్ణాటక–కేరళ సరిహద్దులోని బందిపూర్ అటవీ ప్రాంతం కథకు నేపథ్యం. అక్కడ లభించే ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఒక్కో దంతం కోట్ల రూపాయలు పలకడంతో వాటిని ‘వైట్ గోల్డ్’గా భావిస్తూ అక్రమ రవాణా సాగుతుంది. ఈ స్మగ్లింగ్ రాకెట్‌ను తన ఆధీనంలోకి తీసుకుని, అక్కడి గిరిజనులను బానిసలుగా మార్చుకుని, ఊరిమీద గుప్పిట్లో పెట్టుకుని రాజ్యమేలే వ్యక్తి మారి (సునీల్). వ్యాపారానికి అడ్డొచ్చిన వారిని కిరాతకంగా హతమార్చే క్రూరుడిగా అతని పాత్రను చూపించారు.

మరి సామ్రాజ్యాన్ని కూల్చి, ఆ బిజినెస్‌ను చేజిక్కించుకోవాలని చూసే ఎడ్డీ (కబీర్ దుహాన్ సింగ్) రాజకీయ బలం పెంచుకుంటూ అతనికి గట్టి టక్కర్ ఇస్తాడు. ఇలాంటి సమయంలో మారికి అండగా నిలిచే వ్యక్తి ఆంటోనీ (ఆంటోనీ వర్గీస్). అతను మారి నమ్మకాన్ని గెలుచుకుంటూనే, మరోవైపు ఊరి జనాలకు దగ్గరవుతాడు. ఎడ్డీ తమ్ముడు రాబీని చంపాల్సిన పరిస్థితి రావడం, తర్వాత మారి చేస్తున్న దారుణాలను తట్టుకోలేక ఆంటోనీ అతనికి ఎదురు తిరగడం, ఊరి జనాల కోసం ఏనుగును చంపి దంతాలను శ్రీలంకలో అమ్మడం వంటి సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో మారి, ఆంటోనీ మధ్య జరిగే పోరాటం, లూసీ పాత్ర పాత్రధార్యం, ఆంటోనీ గతం, ఎడ్డీకి ఏమవుతుంది వంటి అంశాలు మిగతా కథను నిర్మిస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే, ఆంటోనీ వర్గీస్ యాక్షన్ సన్నివేశాల్లో బాగా సరిపోయినా, శరీరాకృతి, లిప్ సింక్ పరంగా కొంత అసౌకర్యం కనిపిస్తుంది. సునీల్ పోషించిన మారి పాత్రలో నటన పరంగా పరకాయ ప్రవేశం చేసినప్పటికీ, పాత్ర డిజైన్‌లో కొత్తదనం లేకపోవడం లోపంగా మారింది. ‘పుష్ప’ లోని మంగళం శీను పాత్రను గుర్తు చేసేలా ఈ పాత్రను మలిచినట్లు అనిపిస్తుంది. కబీర్ దుహాన్ సింగ్, రాజ్ తిరందాస్, సిద్ధిఖీ తదితరుల పాత్రలు సాదాసీదాగా సాగాయి.

దుషారా విజయన్ ఈసారి యాక్షన్ కోణాన్ని చూపిస్తూ, భారీ యాక్షన్ సన్నివేశాల్లోనూ తాను నిలబడగలనని నిరూపించింది. ఆమె ఎంట్రీ తరువాత కథనం కొంత వేగం అందుకున్నప్పటికీ, మొత్తం చిత్రాన్ని నిలబెట్టేంత బలం మాత్రం రాలేదు.

సాంకేతికంగా కట్టలను బలంగా కనిపించినా, కథ–కథనం పరంగా కొత్తదనం లేకపోవడం ప్రధాన మైనస్‌గా మారింది. దర్శకుడు పాల్ జార్జ్ తీసుకున్న కథ, ట్రీట్‌మెంట్‌లో 'పుష్ప' , 'KGF' , 'సలార్ ’, 'ఛత్రపతి', వంటి చిత్రాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హీరో–విలన్ మధ్య ఘర్షణ, ఊరి జనాల కోసం హీరో పోరాడే ట్రాక్ వంటి అంశాలు ఇప్పటికే పలుసార్లు చూసినట్లు అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్‌లో అనేక పాత్రలు వరుసగా ఎంట్రీ ఇస్తూ గందరగోళాన్ని సృష్టిస్తాయి. సెకండ్ హాఫ్ కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు అనుసంధానం లేకపోవడంతో పూర్తిగా ఆకట్టుకోలేకపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్, సినిమాటోగ్రాఫర్ రణదివే, ఎడిటర్ షామీర్ మహమ్మద్ టెక్నికల్‌గా మంచి పనితీరు కనబరిచినా, బలహీనమైన కథనాన్ని కాపాడలేకపోయారు.

మొత్తానికి, బలమైన టెక్నికల్ వర్క్ ఉన్నప్పటికీ, బోరింగ్ యాక్షన్ డ్రామాగా మారిపోయింది.

రేటింగ్ 2.25/5. (ఇది పూర్తిగా రివ్యువర్ వ్యక్తి గత అభిప్రాయం మాత్రమే)