‘బేబీ’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKN కాంబినేషన్‌లో వచ్చిన కొత్త చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’పై ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్‌తో పాటు మణిశర్మ స్వరపరిచిన మెలోడీ పాటలు ఈ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ చిత్రం ఆ అంచనాలకు ఎంతవరకు న్యాయం చేసిందో పరిశీలిద్దాం.

కథ చెన్నై నేపథ్యంలో సాగుతుంది. రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమ తర్వాత కాబోయే భర్త అజయ్ (త్రిగుణ్) పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోవడంతో నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) తీవ్ర మానసిక వేదనకు గురవుతుంది. ఆ దెబ్బను తట్టుకోలేక మందుకు బానిసైపోతుంది. చెన్నైలో రూమ్‌మేట్స్‌తో కలిసి జీవిస్తున్న నివి జీవితంలోకి ఆర్ఫన్ అయిన స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ప్రవేశిస్తాడు. మంచి దర్శకుడిగా మారాలని కలలు కనే స్టీవెన్ తో నివి కి మెల్లగా స్నేహం కుదురుతుంది.

స్టీవెన్ అమాయకత్వం, స్వచ్ఛమైన మనసు చూసి నివి మళ్లీ ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ఒక్కటయ్యే దశకు చేరుకున్న సమయంలో కథలో పెద్ద మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? స్టీవెన్ కల నెరవేరిందా? ఈ కథలోకి అజయ్ మళ్లీ ఎలా వస్తాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపై ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి.

ఏ ప్రేమకథకైనా సంఘర్షణే ప్రధాన బలం. ఈ చిత్రంలో కథ ప్రారంభంలోనే హీరోయిన్ లవ్ ఫెయిల్యూర్‌ను చూపించడం, ఆ తర్వాత అమాయకుడైన హీరో ప్రవేశం, వారి మధ్య చిగురించే అనుబంధం వంటి అంశాలు ప్రథమార్థాన్ని ఆసక్తికరంగా, హాయిగా నడిపిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సుమారు ఐదు నిమిషాల సైలెంట్ సీన్ ప్రేక్షకుడి మనసును బలంగా తాకుతుంది. సమీప కాలంలో ఇంత హార్డ్ హిట్టింగ్ ఇంటర్వెల్ సీన్ అరుదుగా కనిపించిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ద్వితీయార్థంలో కథ కాస్త నెమ్మదిగా సాగిన భావన కలిగించినా, భావోద్వేగాలు సినిమాను నిలబెడతాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ దృశ్యాలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేంతగా హృదయాన్ని తాకుతాయి. ఈ చిత్రాన్ని ఎక్కువ లాజిక్‌లు వెతకకుండా చూస్తే, ఒక మంచి ప్రేమకావ్యపు మ్యాజిక్‌ను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.

నటీనటుల విషయానికి వస్తే, సినిమాలో అసలైన హీరోగా గౌరీ ప్రియా నిలిచింది. నివి పాత్రలో ఆమె పూర్తిగా జీవించింది. భావోద్వేగ సన్నివేశాల్లో కిరణ్ తన నటనలో పరిణతి చూపించి, ప్రేక్షకులను కదిలించాడు. ఇతర నటులు తమ పాత్రల పరిధిలో సమర్థవంతంగా నటించారు.

సాంకేతికంగా సినిమా బలంగా నిలిచింది. చాలా రోజుల తర్వాత మని శర్మ తన పాత మ్యాజిక్‌ను మళ్లీ ప్రదర్శించారు. పాటలతో పాటు మనసును మీటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి. ప్రతీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఆహ్లాదకరంగా కనిపించేలా చిత్రీకరణ సాగింది. నిర్మాణ విలువలు కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి.

మొత్తం మీద ‘చెన్నై లవ్ స్టోరీ’ మహాద్భుతమైన చిత్రం కాకపోయినా, ప్రేక్షకులను నిరాశపరచని, స్వచ్ఛమైన, హృదయాన్ని తాకే ప్రేమకథగా నిలుస్తుంది. చాలా రోజుల తర్వాత మంచి ప్రేమకథను చూసిన తృప్తితో థియేటర్ నుంచి బయటకు రావచ్చని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.