రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
రివ్యూ ‘కర్మాఖ్య’
ఈ మధ్యకాలంలో అస్సాం రాజధాని గౌహతిలో ఉన్న కామాఖ్య శక్తిపీఠం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే పేరుతో, ‘జబర్దస్త్’ ద్వారా ఫేమ్ సంపాదించిన అభినవ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ కావడంతో, ఆ చిత్రం మీద సినీప్రియుల దృష్టి పడింది. కామాఖ్య అమ్మవారి గురించి సినిమా చేస్తున్నారేమో అనే ప్రచారం మధ్య, ఆ గుడితో కొంత సంబంధం ఉన్న మాట వాస్తవమే అయినా, అమ్మవారి గురించి సినిమా కాదని చిత్రబృందం ముందే స్పష్టం చేసింది. తరువాత సెన్సార్ ఇబ్బందుల కారణంగా ‘కామాఖ్య’ అనే పేరును ‘కర్మాఖ్య’గా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా జూలై 31న విడుదలైంది.
కర్మాఖ్య కథ విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది. అక్కడి ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఒకే గదిలో ఉండే ప్రవళిక (శరణ్య ప్రదీప్), కామాఖ్య (సమీరా) ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఒకరి కోసం ఒకరు ఏం చేయడానికైనా సిద్ధపడేంత దగ్గరగా ఉంటారు. ఈ క్రమంలో ప్రవళిక ఓ పెళ్లికి వెళ్లాల్సి రావడంతో, ఆమె స్థానంలో ఇన్సూరెన్స్ పాలసీ ఫీల్డ్ విజిట్ కోసం కామాఖ్య వెళ్లుతుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఒక ఇంటికి చేరుకున్న ఆమెను అక్కడి భార్యాభర్తలు (అభిరామి, ఆనంద్ భారతి) సాదరంగా ఆహ్వానిస్తారు.
పది నిమిషాల పని కోసం వెళ్లిన కామాఖ్య, మళ్లీ బయటకు రాకుండా, ఆ భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తారు. అసలు ఆ భార్యాభర్తలు ఎవరు? ఎందుకు కామాఖ్యను ఇంట్లో బంధించారు? అక్కడ చిక్కుకున్న కామాఖ్య కోసం ప్రవళిక వచ్చిందా లేదా? ఈ కథలో ఎస్సై తిరుపతి (సముద్రఖని) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమాను థియేటర్‌లోనే చూడాలి.
‘కామాఖ్య’ అనే టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కథలో కూడా కామాఖ్య దేవితో కొంతవరకు సంబంధం ఉండేలా రచించారు. కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు అభి ఈ కథను రాసుకున్నారని గతంలో తెలిపారు. అయితే కథ పూర్తిగా కొత్తగా అనిపించదు. ఎందుకంటే ఇలాంటి మూఢనమ్మకాల నేపథ్యంలో జరిగే సంఘటనలను వార్తలలో తరచూ చూస్తూనే ఉన్నాం.
సైన్స్, టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా, మూఢనమ్మకాల మీద ఆధారపడి కోట్లకు కోట్లు కలిసి వస్తాయని కలలు కనే వారు, తమ వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా పూజలు, తంత్రాలు చేయించేవారు ఇంకా ఉన్నారు. అలాంటి మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. దానికి కామాఖ్య దేవితో లింక్ పెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది.
ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్‌లోనే కామాఖ్య దేవి, ఆ క్షేత్రంలో జరిపే కొన్ని తంత్ర విద్యల గురించి ప్రస్తావన రావడంతో, సినిమా ఆ తంత్ర విద్యల చుట్టూ తిరుగుతుందనే హింట్ ఇస్తుంది. పెద్దగా వివరాల్లోకి వెళ్లకుండా, కథను హీరోయిన్ చుట్టూ నడిపించడం వల్ల కొంత బోర్ ఫీలింగ్ కలిగినా, అది సెకండ్ హాఫ్‌లో జరగబోయే సంఘటనలకు ప్రిపరేషన్‌గా తర్వాత అర్థమవుతుంది. హీరోయిన్ ఒక ఇంట్లోకి వెళ్లి చిక్కుకున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి బయటపడేందుకు ఆమె చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి.
సెకండ్ హాఫ్‌లో రాసుకున్న కొన్ని ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే మరొక పార్ట్ కోసం వదిలిన లీడ్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించారు, అవి స్క్రీన్‌పై పనిచేశాయి.
నటీనటుల విషయానికి వస్తే, కామాఖ్య పాత్రలో నటించిన సమీరాకు ఇది తొలి సినిమా అయినప్పటికీ, నటనలో మాత్రం ఆ అనుభవలేమి కనిపించలేదు. పరిణతి ఉన్న నటి లాగా తన సన్నివేశాల్లో ఆకట్టుకుంది. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ నటి అభిరామి అని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన ప్రభావం చూపింది. ఆనంద్ భారతి తన పాత్ర పరిమితుల్లోనే ఆకట్టుకున్నారు. శరణ్య ప్రదీప్‌కి చాలా కాలం తర్వాత మంచి పాత్ర దక్కింది. సముద్రఖని కనిపించిన సీన్స్ తక్కువైనా, తన పాత్రకు తగిన ఇంపాక్ట్ ఉంది.
టెక్నికల్ పరంగా చూస్తే, సంగీత దర్శకుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. పాటలు పెద్దగా గుర్తుండేలా లేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి అసెట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ కథ, మూడ్‌కు తగ్గట్టుగా సెట్ అయి, థ్రిల్లర్ ఫీల్‌ను మద్దతు ఇచ్చింది. నిడివి కూడా పెద్దగా కంప్లైంట్ చేసేలా లేదు. AI వాడకం సినిమా బడ్జెట్‌ను కంట్రోల్‌లో పెట్టి ఉండవచ్చని అనిపిస్తుంది. తక్కువ లొకేషన్స్‌లోనే షూటింగ్ ముగించినప్పటికీ, కథ డిమాండ్‌కు తగ్గట్టుగా నిర్మాతలు ఖర్చు పెట్టినట్టు అవుట్‌పుట్ చూస్తే తెలుస్తుంది.
మొత్తం మీద, ‘కర్మాఖ్య’ ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
రేటింగ్ 2.75/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే







