‘దసరా’, ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి, ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కె.జె.క్యు’. కింగ్, జాకీ, క్వీన్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. గతంలో నాగార్జునతో ‘కేడి’ అనే సినిమా చేసిన దర్శకుడు కిరణ్ (కేకే) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే సినిమా విడుదలకు ముందే ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

దర్శకుడు కిరణ్ మరణం తర్వాత కూడా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయించి, ఎట్టకేలకు ‘కె.జె.క్యు’ను థియేటర్లకు తీసుకొచ్చారు. హైదరాబాదీ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న పార్థ (దీక్షిత్ శెట్టి) ఓ అనాధ. అతన్ని చేరదీసిన చిచ్చా (మురళీధర్ గౌడ్) అతనిని పెద్ద డాన్‌గా తీర్చిదిద్దుతాడు. ఇదే సమయంలో అనాధ అయిన జాకీ (శశి ఓదెల) పార్థకు దగ్గరవుతాడు. వీరిద్దరూ కలిసి స్కెచ్ వేస్తే ఎంతటి మనిషినైనా లేపేయగలిగే స్థాయికి చేరతారు. తక్కువ కాలంలోనే ఈ గ్యాంగ్ హైదరాబాద్ మొత్తం మీద పెత్తనం చెలాయించే స్థాయికి ఎదుగుతుంది.

ఈ క్రమంలో పార్థ, భార్గవి (యుక్తి తరేజా) అనే యువతిపై మనసు పెట్టుకుంటాడు. కానీ భార్గవి మాత్రం అతని ప్రేమను అంగీకరించదు. దీనితో పార్థ ఆమెను చంపేందుకు కూడా సిద్ధపడతాడు. అయితే ఆమెను చంపడానికి వెళ్లిన జాకీ నిజంగా ఆమెను చంపాడా లేదా? చివరికి ఏం జరిగింది? భార్గవి అసలు ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమాను థియేటర్‌లోనే చూడాలి.

విశ్లేషణ: ఇద్దరు స్నేహితులు, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితులు పోటీ పడటం, చివరికి బద్ధ శత్రువులుగా మారడం వంటి కథల్ని ఇప్పటికే తెలుగులో ఎన్నోసార్లు చూసిన ప్రేక్షకులకు, ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడే అదే భావన కలుగుతుంది. కానీ సినిమా ప్రారంభమైన తర్వాత మాత్రం ఊహించినంత కొత్తదనం కనిపించదు. సాధారణ గ్యాంగ్స్టర్ డ్రామాలా కథ ముందుకు సాగుతుంది.

హీరోయిన్ భార్గవిగా యుక్తి తరేజా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ మనం ఊహించిన దిశలోనే సాగుతుందనే భావనను దర్శకుడు సృష్టించాడు. అయితే ఆ తర్వాత కథను కొంచెం కొత్త యాంగిల్‌లో నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ కొత్త యాంగిల్ ఉన్నప్పటికీ, మొత్తం కథను కొత్తదనంగా చెప్పలేము. ట్రీట్మెంట్‌లో మాత్రం కొద్దిగా భిన్నత్వం కనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్‌లో ఇద్దరు హీరోల పరిచయం, వారి ఎదుగుదల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ తర్వాత పార్థ, భార్గవి మీద ప్రేమలో పడటం, దాని వల్ల జరిగే పరిణామాలను కొంత ఆసక్తికరంగా రాసుకున్నప్పటికీ, మొత్తం మీద రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ఫీలింగ్ నుంచి బయటపడలేకపోయింది.

నటీనటులు: దీక్షిత్ శెట్టి తనకు అలవాటైన తరహా పాత్రలో సహజంగా నటించాడు. స్క్రీన్‌పై బాగా కనిపించాడు, తన పాత్రలో ఆకట్టుకున్నాడు. యుక్తి తరేజాకు నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది, ఆమె కూడా తన పాత్రను బాగా నెరవేర్చింది. మురళీధర్ గౌడ్ తన పాత్ర పరిధిలో నటించాడు. మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రల మేరకు సరైన అభినయంతో కనిపించారు.

టెక్నికల్ విభాగం: దర్శకుడిగా కేకే తనదైన స్టైల్‌లో సినిమా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ‘కేడి’లో కొంతవరకు కామెడీ వర్కౌట్ అవ్వగా, ‘కె.జె.క్యు’లో మాత్రం పూర్తిగా డ్రామాపైనే దృష్టి పెట్టాడు. ఈ ఎంపిక వల్ల కొంత రొటీన్ ఫీలింగ్ ఎక్కువైంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరాసరి స్థాయిలో ఉంది; మరింత బలంగా ఉంటే కొన్ని సన్నివేశాలు ఇంకా ఎలివేట్ అయ్యేవి. పాటలు కూడా పరవాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. నిర్మాణ విలువలు మంచి స్థాయిలో కనిపిస్తున్నాయి.

మొత్తం మీద: ‘కె.జె.క్యు’ ఒక రొటీన్ హైదరాబాదీ గ్యాంగ్స్టర్ డ్రామా. కొత్త యాంగిల్ ప్రయత్నం ఉన్నప్పటికీ, కథా నిర్మాణం, భావోద్వేగాల పరంగా పెద్దగా కొత్తదనం అందించలేకపోయింది.

రేటింగ్:- 2.25/5

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే