తమిళ సినీ పరిశ్రమలో కొద్దికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఈసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ‘డీసీ’ చిత్రంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించగా, వామికా గబ్బి కథానాయికగా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అదే పేరుతో విడుదల చేసింది.

‘డీసీ’ కథ దేవదాస్ (లోకేష్ కనగరాజ్) చుట్టూ తిరుగుతుంది. దేవదాస్ మరో నలుగురితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి, పోలీసులు వినియోగించబోయే తుపాకులను దొంగిలిస్తాడు. దీంతో పోలీసులు ఈ గ్యాంగ్‌ను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఈ క్రమంలో అనుకోకుండా ఒక పోలీస్ అధికారిని దేవదాస్ గ్యాంగ్ అత్యంత దారుణంగా హత్య చేస్తుంది. దీంతో పోలీసులు మరింత దృష్టి సారించి ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతారు.

అయితే ఈ గ్యాంగ్ అసలు లక్ష్యం ఏమిటి? ఎందుకు పోలీసులను టార్గెట్ చేసింది? పోలీసుల నుంచి దొంగిలించిన తుపాకులతో ఏమి చేసింది? ఆ పోలీస్ అధికారిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ మొత్తం కథలో చంద్ర (వామికా గబ్బి) పాత్ర ప్రాధాన్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమాను థియేటర్‌లోనే చూడాల్సి ఉంటుంది.

విశ్లేషణలోకి వెళితే, గతంలో కీర్తి సురేష్‌తో ‘సానీ కాగితం’, ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ వంటి చిత్రాలు చేసిన అరుణ్ మాథేశ్వరన్, ఈసారి తన తోటి దర్శకుడైన లోకేష్ కనగరాజ్‌ను హీరోగా తీసుకుని ‘డీసీ’ని రూపొందించాడు. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రారంభం నుంచి అరుణ్ మాథేశ్వరన్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిస్థాయి రా, రస్టిక్ టోన్‌తో సినిమా నడుస్తుంది.

కథ పరంగా కొత్తగా చెప్పుకునే అంశాలు పెద్దగా లేవు. ఇది ఒక రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. అయితే దానికి పీరియాడిక్ సెటప్ ఇచ్చి కథను నడిపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్‌లో లోకేష్ గ్యాంగ్ ఎందుకు గన్స్ దొంగతనం చేస్తోంది, వారి అసలు లక్ష్యం ఏమిటి అనే విషయాలను పూర్తిగా దాచిపెట్టి, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. తరువాత వామికా ఎంట్రీతో కథలో కొత్త ట్విస్టులు వస్తాయేమో అనిపించినా, పెద్దగా మార్పులు లేకుండానే కథ సాగుతుంది.

మొత్తంగా చూస్తే, పోలీసుల నుంచి న్యాయం దొరకకపోవడంతో వారిపై తిరుగుబాటు చేసే ఒక చదువుకున్న వ్యక్తి ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తుంది. దీనికి కమర్షియల్ హంగులు జోడించి, అనిరుధ్ రవిచందర్ సంగీతంతో మ్యాజిక్ చేయాలనే ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా. అయితే దర్శకుడు హీరోగా మారి ఏ రకం సినిమా చేశాడు అన్న ఆసక్తి చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేక సన్నివేశాలను ఎలివేట్ చేస్తూ, థియేటర్‌లో ఎనర్జీని పెంచుతుంది. కొన్ని చోట్ల ప్రేక్షకుల స్పందనను ఎరప్ట్ అయ్యేలా చేసింది. సినిమాటోగ్రఫీ పీరియాడిక్ సెటప్‌కి తగ్గట్టుగా ఉంది. నిడివి క్రిస్పీగా ఉండటం వల్ల బోర్ అనిపించే అవకాశం తక్కువ. కథ రొటీన్ అయినా, స్క్రీన్‌ప్లేలో పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా నడిపించారు.

నటీనటుల విషయానికి వస్తే, ఈ చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా లాంచ్ అయిన లోకేష్ కనగరాజ్, దేవదాస్ పాత్రలో సరైన ఎంపికగా కనిపించాడు. ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ అవసరం లేని ఈ పాత్రలో అతను లీనమై నటించాడు. వామికా గబ్బి పాత్ర చిన్నదైనా ప్రభావవంతంగా ఉంది. సంజనా కృష్ణమూర్తి నటన సరిపడే స్థాయిలో ఉంది. లోకేష్ గ్యాంగ్‌లోని ఇతర నటులు వయొలెన్స్ సృష్టిస్తూనే, కొన్నిచోట్ల హాస్యాన్ని కూడా పండించే ప్రయత్నం చేశారు.

టెక్నికల్ టీమ్‌లో అనిరుధ్ రవిచందర్ పని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేలా ఉంది. తెలుగు డబ్బింగ్ సరిగ్గా సెట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా, ‘డీసీ’లో ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, ఇది ప్రధానంగా ఒక రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన మొదటి ప్రయత్నం, అనిరుధ్ సంగీతం, అరుణ్ మాథేశ్వరన్ రా ట్రీట్‌మెంట్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు.

రేటింగ్ : 2.5/5

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే