క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలు ఇటీవలి కాలంలో అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ వరుసలోనే కన్నడలో 2021లో విడుదలైన ‘సీతారామ్‌ బెనోయ్‌ కేస్‌.18’ మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన తాజా చిత్రం ‘సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌’ ఇప్పుడు ఓటీటీ వేదికపై ప్రేక్షకులను పలకరిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమాకు ఇటీవల తెలుగు ఆడియోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ చిత్రంలో విజయ్‌ రాఘవేంద్ర, గోపాలకృష్ణ దేశ్‌పాండే, సాగర్‌ పురాణిక్‌, ఉషా భండారీ తదితరులు నటించారు. రచన, దర్శకత్వం దేవి ప్రసాద్‌ శెట్టి. శివమొగ్గ జిల్లాలోని ఆనెగద్దె పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే నిజాయతీ గల పోలీస్‌ ఆఫీసర్‌ సీతారామ్‌ (విజయ్‌ రాఘవేంద్ర) చుట్టూ కథ తిరుగుతుంది.

స్థానికంగా జరిగిన ఓ దారుణ హత్యపై సమాచారం అందుకున్న సీతారామ్‌ తన టీమ్‌తో కలిసి ఘటనాస్థలానికి చేరుకుంటాడు. అక్కడ ఒక వ్యక్తిని ఇనుప కంచెలకు కాళ్లు, చేతులు కట్టేసి, క్రూరంగా పొడిచి చంపిన దృశ్యాలు కనిపిస్తాయి. ఇదే తరహాలో మరికొన్ని హత్యలు వరుసగా జరుగుతాయి. హత్యల తీరు చూస్తే ఇవన్నీ ఓ సైకో కిల్లర్‌ పని అని పోలీసులు అంచనా వేస్తారు. ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు ఈ దారుణాలకు పాల్పడ్డాడు? ఆధారాలు లేని ఈ కేసును సీతారామ్‌ ఎలా ఛేదించాడు? చిన్నప్పుడే దూరమైన అక్క, ఆమె కుటుంబాన్ని ఎలా కలుసుకున్నాడు? ఇవన్నీ కథలోని ముఖ్యాంశాలు.

క్రైమ్‌ థ్రిల్లర్‌లకు సర్వసాధారణమైన ఫార్మాట్‌లోనే ఈ సినిమా సాగుతుంది. వరుస హత్యలు, వాటిని ఛేదించేందుకు రంగంలోకి దిగే పోలీస్‌ ఆఫీసర్‌, విచారణలో ఎదురయ్యే సవాళ్లు, ఒక్కో ఆధారాన్ని పట్టుకుని చివరికి నిందితుడిని పట్టుకునే ప్రయాణం – ఈ మూసను దర్శకుడు దేవి ప్రసాద్‌ శెట్టి ఈ చిత్రంలోనూ అనుసరించారు. హంతకుడు ఎవరో క్లైమాక్స్‌ వరకూ తెలియనీయకుండా కథనం దోబూచులాడే విధానం చిత్రానికి బలం చేకూర్చింది.

తన కుమార్తెను వేధిస్తున్నాడని పోలీసుల వద్దకు వచ్చే ఉపాధ్యాయుడి ఉపకథ, గతంలో ఇదే తరహాలో జరిగిన హత్యల కేసు బయటపడటం, ప్రేమజంటకు సంబంధించిన ఉపకథ వంటి అంశాలను ప్రధాన కథతో లింక్‌ చేస్తూ దర్శకుడు కథనాన్ని నడిపారు. ఈ మలుపులు కొంతవరకూ ఆసక్తిని రేపినా, ద్వితీయార్ధంలో కథనం మరీ నెమ్మదిగా, సాగదీతగా అనిపించే సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో హంతకుడు ఎవరో తెలిసిన తర్వాత ప్రేక్షకుడికి పెద్దగా థ్రిల్‌ కలగదు. హంతకుడు సైకోగా మారాల్సి వచ్చిన నేపథ్య కథలో బలం లేకపోవడం కూడా ప్రభావం చూపింది.

విజయ్‌ రాఘవేంద్ర సీతారామ్‌ పాత్రలో సటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో సముచితంగా నటించారు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం వంటి సాంకేతిక అంశాలు చిత్రానికి తోడ్పడ్డాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే సినిమాకు మరింత కుదింపు వచ్చేదని అనిపిస్తుంది.

దర్శకుడు దేవి ప్రసాద్‌ శెట్టి రొటీన్‌ రివెంజ్‌ డ్రామా మూలకథను ఎంచుకుని, దాన్ని థ్రిల్‌ పంచేలా ప్రజెంట్‌ చేయడానికి ప్రయత్నించారు. పతాక సన్నివేశాలు, హంతకుడి బ్యాక్‌స్టోరీలో మరింత బలమైన పాయింట్‌ ఉంటే సినిమా ఇంకా థ్రిల్లింగ్‌గా ఉండేదనే భావన కలుగుతుంది. అయినప్పటికీ క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడే ప్రేక్షకులకు ‘సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌’ ఓసారి చూడదగ్గ చిత్రంగా నిలుస్తుంది.

కుటుంబంతో చూడటానికి ఎలాంటి ఇబ్బంది లేని కంటెంట్‌తో ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

రేటింగ్:- 2.5/5