రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
రివ్యూ స్పైడర్ మ్యాన్ ‘బ్రాండ్ న్యూ డే’-ఎమోషన్, విజువల్ ఫీస్ట్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన స్పైడర్ మ్యాన్ తాజా చిత్రం ‘బ్రాండ్ న్యూ డే’ గురువారం థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే విపరీతమైన ప్రచారం పొందిన ఈ చిత్రం, 2021లో వచ్చిన ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ’ సినిమాకు కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హల్క్, పనిషర్ , జీన్ వంటి కొత్త శక్తివంతమైన పాత్రలు ఈసారి జతకావడంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అభిమానుల్లో మరింతగా పెరిగింది.
గత చిత్రం ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ’ ముగిసిన దగ్గర నుంచే ఈ సినిమా కథ మొదలవుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ , స్పైడర్ మ్యాన్ కలిసి చేసిన మంత్రం వల్ల పీటర్ పార్కర్ తప్ప ప్రపంచం అంతా స్పైడర్ మ్యాన్ గురించి పూర్తిగా మరిచిపోతుంది. అందులో అతని ప్రేమికురాలు MJ, స్నేహితుడు Ned కూడా ఉంటారు. దీంతో పీటర్ తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి, పూర్తిగా స్పైడర్ మ్యాన్ గానే మారి న్యూ యార్క్ నగరంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉంటాడు.
అయితే MJ, Ned లను కోల్పోయిన బాధ పీటర్ ను లోలోపల నలిపేస్తూ ఉంటుంది. వారితో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ ఒంటరిగా తల్లడిల్లిపోతాడు. రహస్యంగా తన మిత్రులను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉండే పీటర్ , ఒకసారి MJ మరొకరితో ప్రేమలో ఉన్న దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. ఈ మానసిక సంఘర్షణ అతని శక్తులపై ప్రభావం చూపుతుంది. ఒక్కసారిగా హైపర్‌గా మారడం, వెంటనే శక్తి తగ్గిపోవడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి.
ఇదే సమయంలో బయటకు కనిపించని ఓ అదృశ్య శక్తి క్షణాల్లో ఎదుటివారి మైండ్లను, మనుషులను తన ఆధీనంలోకి తీసుకుంటూ, సూపర్ పవర్ కలిగిన వ్యక్తులను పర్యవేక్షించే డిపార్ట్మెంట్ అఫ్ డామేజే కంట్రోల్ (DODC) అనే డిఫెన్స్ సంస్థపై మెరుపు దాడి చేస్తుంది. స్పైడర్ మ్యాన్ ఇది గుర్తించి అక్కడికి చేరుకున్నప్పటికీ దాడిని పూర్తిగా అడ్డుకోలేడు. చివరికి స్పైడర్ మ్యాన్ మైండ్‌ను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఆ శక్తి విఫలమై అక్కడి నుంచి వెనుదిరుగుతుంది.
తర్వాత స్పైడర్ మ్యాన్, V-Max అనే సీక్రెట్ వస్తువు కోసం ఈ దాడి జరిగిందని తెలుసుకుంటాడు. దాని వెనక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అప్పటివరకు సాధారణ మనిషిలా ఉన్న హల్క్ అదుపు తప్పడంతో అతనితో కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. అంత శక్తివంతమైన ఆ అదృశ్య శక్తి ఎవరు, ఎందుకు నగరాన్ని స్థంభింపజేసింది, దాని నుంచి స్పైడర్ మ్యాన్ నగరాన్ని, ప్రజలను ఎలా కాపాడాడు, అతనికి పనిషర్ ఎలా సాయం చేశాడు, హల్క్ ఎందుకు స్పైడర్ మ్యాన్ తో ఢీకొనాల్సి వచ్చింది వంటి అంశాల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది.
విశ్లేషణ పరంగా చూస్తే, ‘ నో వే హోమ్ ’ ముగిసిన చోట నుంచే కథను నేరుగా ముందుకు తీసుకెళ్లడం ప్లస్ పాయింట్. తన గురించిన గతాన్ని మరిచిపోయిన మిత్రులను నేరుగా కలవలేక పీటర్ లోలోపల కుమిలిపోవడం, శక్తులు సన్నగిల్లడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల్లో కూడా స్పైడర్ మ్యాన్ పట్ల సానుభూతిని కలిగిస్తాయి. మొదట కోపంతో రగిలిపోతున్న పనిషర్ ను అదే స్థాయిలో ఎదుర్కొని అతన్ని కంట్రోల్ చేసే సమయంలో వచ్చే పోరాట సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. ఆపై అతనితో స్నేహం చేస్తూనే తన ప్రేయసిని కాపాడుకునేందుకు పీటర్ పడే తాపత్రయం, ఈ క్రమంలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
క్లైమాక్స్‌కు దగ్గరగా, ఇతరుల మైండ్లను కంట్రోల్ చేసే అదృశ్య శక్తితో స్పైడర్ మ్యాన్ తలపడే ప్రతి సన్నివేశం గూస్బంప్స్ తెప్పించేలా ఉంటుంది. మరో సందర్భంలో తీవ్ర కోపంతో ఉన్న Hulkను శాంతింపజేసే సమయంలో Punisherతో కలిసి స్పైడర్ మ్యాన్ చేసే యాక్షన్ సీన్లు, క్లైమాక్స్‌లో Ninjasతో జరిగే పోరాటం నెక్ట్స్ లెవల్‌గా అనిపిస్తుంది. అయితే పూర్తిగా యాక్షన్ సినిమా అనుకుని వచ్చే వారికి మాత్రం కొంత నిరాశ కలగొచ్చు. యాక్షన్ కంటే ఎమోషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
విజువల్స్ విషయానికి వస్తే, ఇంతకుముందు స్పైడర్ మ్యాన్ చిత్రాల్లో చూడని రేంజ్లో ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ ఎగిరే సన్నివేశాలు ఈసారి ఎక్కువగా ఉండటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా 3Dలో సినిమా చూసే వారికి స్పైడర్ మ్యాన్ జంప్ చేసే కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి. సాధారణ స్క్రీన్లలో ఆ ఫీల్ కొంత తగ్గొచ్చు. హల్క్ పాత్రను ఒకటి రెండు ఘట్టాలకే పరిమితం చేయడం మాత్రం అతని అభిమానులకు జీర్ణించకపోవచ్చు; కానీ అతను కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి.
నటీనటుల పరంగా పీటర్ పార్కర్ , స్పైడర్ మ్యాన్ ద్విపాత్రాభినయంలో టామ్ హాలండ్ తన పాత్రలో పూర్తిగా జీవించాడు. ఒక వైపు అదృశ్య శక్తితో పోరాటం చేస్తూనే, మరో వైపు ప్రేయసి ఎడబాటు, అంతకుమించి తన శక్తులు ప్రభావం కోల్పోయే సన్నివేశాల్లో అతని నటన కెరీర్లోనే ఉత్తమంగా నిలిచేలా ఉంది. MJ పాత్రలో జందాయ కొన్ని సన్నివేశాల్లో కొద్దిగా బొద్దుగా కనిపించినప్పటికీ, పాత్రకు న్యాయం చేసింది. Ned పాత్ర నిడివి తక్కువైనా, క్లైమాక్స్‌లో గతం గుర్తుకు వచ్చే చిన్న క్లిప్ ఫుల్ హై తెప్పిస్తుంది.
పనిషర్ గా జాన్ బెర్న్తాల్ , జీన్ గా సడీ సింక్ లకు మంచి ప్రాధాన్యం, నిడివి ఉన్న పాత్రలు దక్కగా వారు తమ వంతు న్యాయం చేశారు. బ్రూస్ బ్యానర్ (Hulk) పాత్రలో మార్క్ రాఫ్ఫాలో కనిపించిన కొద్దిసేపు ప్రేక్షకులను రంజింప చేశాడు. సినిమాటోగ్రఫీ, విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘ షాంగ్ - చి and ది లెజెండ్ అఫ్ ది టెన్ రింగ్స్ ’ వంటి సంచలన బ్లాక్‌బస్టర్‌ను తెరపైకి తీసుకొచ్చిన డస్టిన్ డేనియల్ క్రెట్న్ ఈ చిత్రంలో కూడా తనపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే పని చేశాడు.
సినిమాలో అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకపోవడం, యాక్షన్ సీన్లు ఉన్నప్పటికీ ఎక్కడా రక్తపాతం చూపించకపోవడం కుటుంబ ప్రేక్షకులకు అనుకూలంగా మారాయి. పిల్లలతో, ఫ్యామిలీలతో కలిసి ఎలాంటి జంకు లేకుండా థియేటర్‌కు వెళ్లి ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు. అయితే వీలైనంతవరకు 3D ఫార్మాట్లోనే చూడడం ఉత్తమం.
రేటింగ్: 3.5 / 5 – ఎమోషనల్, విజువల్ ఫీస్ట్







