రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌పై నిర్మించిన తాజా చిత్రం ‘రోమాంచకం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రంతో వేణు గోపాల్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్, విజయ్ దేవరకొండ తదితర అగ్ర కథానాయకులు పాల్గొనడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై యువతలో ఆసక్తి పెరిగింది.
కథ విషయానికి వస్తే... అన్వేష్ (సుమంత్ ప్రభాస్) కళాశాల చదువు పూర్తి చేసుకున్న యువకుడు. స్నేహితులతో కలిసి స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలని చూస్తుంటాడు. ‘రోమాంచకం’ పేరుతో డేటింగ్ యాప్ తీసుకురావాలనేది అతని ఆలోచన. అమ్మాయిలు, అబ్బాయిల అవసరాలు తీర్చేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెబుతుంటాడు. అదే యాప్ ద్వారా చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్)తో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
మైథిలి పుట్టినరోజు తెలుసుకున్న అన్వేష్ ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చెన్నైకి వెళ్తాడు. ఓ హోటల్‌లో ఉన్నానని, అక్కడికి రావాలని మైథిలికి సమాచారం ఇస్తాడు. వస్తానని చెప్పిన మైథిలి అకస్మాత్తుగా ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లన్నింటిలోనూ అన్వేష్‌ను బ్లాక్ చేస్తుంది. ఆమె హోటల్‌కు రాకపోవడానికి కారణం ఏమిటి? ఆమె మాయం వెనక ఎవరు ఉన్నారు? మళ్లీ తిరిగి వస్తుందా లేదా? అన్వేష్, మైథిలి మధ్య నిజంగా ప్రేమ ఉందా లేదా? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రంలో ప్రేమకథ కంటే మధ్యలో వచ్చే చిన్న ఉత్కంఠ, దాని చుట్టూ పండిన హాస్యమే ప్రధాన బలం. హీరో స్టార్టప్ కథతో సినిమా మొదలవుతున్నా, కొంతసేపటికి ఆ అంశం పూర్తిగా మాయమవుతుంది. హీరో, హీరోయిన్ పాత్రలు నడుచుకునే తీరు, వారి నిర్ణయాలకు పెద్దగా లాజిక్ కనిపించదు. అయితే ఈ లోపాలన్నింటినీ మరిచిపోయేలా చేసే బలమైన బడ్డీ కామెడీ చిత్రంలో ఉంది.
హీరో, అతని స్నేహితుల మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. జెన్‌జీ కుర్రాళ్ల అల్లరి, అమాయకత్వం, ఫ్రస్టేషన్, ఎంత జరిగినా స్నేహితుల కోసం ఒకరికొకరు అండగా నిలిచే తీరు – ఇవన్నీ సినిమాకి బలం చేకూర్చాయి. ఆరంభ సన్నివేశాలు కథ ఎటు వెళుతుందో అనే గందరగోళాన్ని రేకెత్తించినా, హీరో చెన్నైకి వెళ్లిన దగ్గర నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అక్కడ మైథిలి అకస్మాత్తుగా అన్వేష్‌ను బ్లాక్ చేయడంతో కథ ఉత్కంఠగా మారిపోతుంది. ఇక్కడి నుంచే అసలు రోమాంచకం మొదలవుతుంది.
ద్వితీయార్ధంలో ఉపేంద్ర లిమాయేను పోలీస్‌గా చూపిస్తూ కామెడీ పండించే ప్రయత్నం చేసినా, అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు. అక్కడ కూడా హీరో, అతని స్నేహితుల గ్యాంగ్ మధ్య వచ్చే సన్నివేశాలే హైలైట్‌గా నిలిచాయి. క్లైమాక్స్ భాగంలో సందడి, అతిథి పాత్ర చుట్టూ సాగే హంగామా ఆకట్టుకుంటాయి. రీజనల్ ఫీలింగ్ ప్రస్తావనతో సాంబార్, బిరియానీ అంటూ పేలే సంభాషణలు, విరామానికి ముందు ఆత్మహత్య నేపథ్యంలోని సన్నివేశాలు, హీరోయిన్‌కు ఫ్లాట్ ఇప్పించేందుకు హీరో తన స్నేహితులను మాటలతో బురిడీ కొట్టించే తీరు, క్లైమాక్స్‌లో హీరోయిన్ పెళ్లి చుట్టూ సాగే హంగామా సినిమాకి హై ఇస్తాయి.
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. పాటల్లో, సన్నివేశాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఫ్రస్టేషన్‌తో కనిపిస్తూనే కామెడీని పండించిన సుమంత్ ప్రభాస్ నటన బాగుంది. అనంతిక అందంగా కనిపించడంతో పాటు, పాటలు, రొమాంటిక్ సన్నివేశాలతో సినిమాపై ప్రభావం చూపించింది. హీరో స్నేహితుల గ్యాంగ్ పాత్రలను ప్రతి యువతరానికి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు దర్శకుడు. ఆ పాత్రల్లో వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ ఒదిగిపోయారు. నరేంద్ర మరింతగా నవ్వించాడు.
వాసుకి వైభవ్ సంగీతం చిత్రానికి ప్లస్. పాటలు బాగున్నాయి. ‘రాధా రమణ’ పాట, దాని చిత్రణ సినిమాకి మరింత ఆకర్షణ. పవన్ పప్పుల విజువల్స్ ఆకట్టుకుంటాయి. రచనలో సంభాషణలే హైలైట్. హాస్యం పండడంలో వాటి పాత్ర కీలకం. దర్శకుడు వేణు గోపాల్‌రెడ్డి ప్రేమ, హాస్యం, ఉత్కంఠ మేళవింపుతో కథ రాసుకోవడం బాగుంది. అయితే ప్రేమ సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. తొలి చిత్రమే అయినా, మేకింగ్‌పై పట్టు చూపించారు.
మొత్తానికి కథలో లాజిక్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా, కాసేపు హాయిగా నవ్వుకుంటూ కాలక్షేపం చేయాలనుకునే ప్రేక్షకులకు ‘రోమాంచకం’ మంచి ఎంపిక. నవ్వుల విషయంలో మాత్రం లోటు చేయదు.
మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది.
రేటింగ్ : 2.5/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే







