వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సాగర్ బి షిండే రచన, నిర్మాణం చేసిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు. కాజల్‌తో పాటు శ్రేయాస్ తల్పాడే, మురళీ శర్మ, మనిశ్ వాద్వా, త్రిష శ్రద్ధా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కథలో యోగేశ్ పాటిల్ (శ్రేయాస్ తల్పాడే) ఆర్మీ ఆఫీసర్. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి అవార్డు అందుకున్న అతని జీవితంలో కుమార్తె పరి పాటిల్ (త్రిష శ్రద్ధా)కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు తెలిసిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఆమె చికిత్స కోసం ఉద్యోగం వదిలి వచ్చి లక్షల్లో ఖర్చు చేసినా పరి ప్రాణాలు దక్కవు. వైద్యుల నివేదిక ప్రకారం, ఆమె మరణానికి కారణం ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి కలిసిన క్రిమిసంహారక మందులు, నిల్వ పదార్థాలే.

దీనిపై పెస్టిసైడ్స్ కంపెనీలు, వాటిని వినియోగిస్తున్న రైతులపై కేసు పెట్టాలని యోగేశ్ ప్రయత్నిస్తాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా అవమానమే ఎదురవుతుంది. నేరుగా కోర్టులో కేసు ఫైల్ చేయాలనుకున్నా ఒక్క లాయర్ ముందుకు రారు. ఇలాంటి సమయంలో లాయర్ అర్చన (కాజల్ అగర్వాల్) ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని కోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. విచారణలోకి వెళ్లే కొద్దీ ఆహార భద్రత, క్రిమిసంహారక మందుల వినియోగం, ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం గురించి విస్తుపోయే నిజాలు బయటపడతాయి. చివరకు ఈ కేసులో కోర్టు ఏ తీర్పు చెప్పింది? ఆ పరిస్థితులకు అసలు బాధ్యత ఎవరిది? అన్నదే చిత్ర కథ.

పాలు రెండు రోజులైనా పాడుకావు, కూరలు గంటలు గడిచినా తాజాగా కనిపిస్తాయి, పండ్లు రోజులు గడిచినా మెరుస్తూనే ఉంటాయి. గ్రామాల నుంచి మహానగరాలకు గంటలు, రోజుల ప్రయాణం చేసి వచ్చినా ఆహార పదార్థాలు చెడిపోకపోవడానికి కారణం మోతాదుకు మించి వినియోగిస్తున్న క్రిమిసంహారక, నిల్వ పదార్థాలేనని చిత్రం చెబుతుంది. మనిషి నరనరాల్లోకి విషం నెమ్మదిగా ఎలా ప్రవేశిస్తుంది? చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారనే ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న భయానక వాస్తవాలను రచయిత సాగర్ బి షిండే, దర్శకుడు చేతన్ తెరపై చర్చించే ప్రయత్నం చేశారు. కథావస్తువుగా ఇది మంచి పాయింట్.

అయితే, కోర్టు సన్నివేశాలు సుదీర్ఘంగా, ఉపన్యాసంలా సాగడం, బలమైన ఎమోషన్స్ లేకపోవడంతో ‘ది ఇండియా స్టోరీ’ సాదాసీదా సందేశాత్మక చిత్రంగా మాత్రమే కనిపిస్తుంది. యోగేశ్ పాటిల్ పోలీస్‌స్టేషన్, లాయర్స్ చుట్టూ తిరిగే సన్నివేశాల తర్వాత అర్చన ప్రవేశంతో నేరుగా కోర్టు చర్చకు వెళ్లిపోయే నిర్మాణం వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది. లాయర్‌గా అర్చనకు ఇదే తొలి కేసు అయినప్పటికీ, ఆమె చెప్పే ప్రతి లాజిక్‌ను న్యాయమూర్తులు వెంటనే స్వీకరించడం, ఆమె సమర్పించిన ఆధారాలపై ప్రత్యేక విచారణకు తక్షణ అనుమతులు ఇవ్వడం, విచారణ వేగంగా పూర్తవడం నమ్మశక్యంగా ఉండదు.

పెస్టిసైడ్స్ వినియోగం వల్ల ఆహార పదార్థాలు ఎలా కల్తీ అవుతున్నాయో ఆధారాలు సేకరించేందుకు అర్చన, ఐజీ విజయ్ రాథోడ్ (మురళీ శర్మ) కలిసి చేసే ప్రయాణం డాక్యుమెంటరీలా అనిపించినా, ఆ సన్నివేశాలు చూస్తే ఇకపై ఏ వస్తువు కొన్నా ఆలోచించకుండా ఉండలేమనిపించేలా ఉంటాయి. ద్వితీయార్ధంలో కోర్టురూమ్ డ్రామాతో పాటు తండ్రీకూతుళ్లైన యోగేశ్, పరి మధ్య ఎమోషనల్ డ్రామాను చూపించే ప్రయత్నం చేశారు.

అర్చన నేపథ్యం, ఆమె గతం, యోగేశ్‌తో ఉన్న సంబంధం ప్రేక్షకుడికి త్వరగానే అర్థమైపోతుంది. కానీ అంతటి సంచలన కేసు వాదిస్తున్న ఆమె గురించి కథలోని ఇతర పాత్రలకు తెలియకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. చివరి అరగంటలో సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో కోర్టు తీర్పు ప్రజెంటేషన్ చూస్తే, దర్శకుడు ముగింపును జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్టు తెలుస్తుంది.

లాయర్ అర్చన పాత్రలో కాజల్ ఆసాంతం కనిపిస్తారు. అయితే ఆ పాత్రకు కావాల్సిన స్టామినా, బలమైన వాదన, కోర్టు సన్నివేశాల్లో కావాల్సిన ఇంపాక్ట్ ఆమె నటనలో పూర్తిగా కనిపించదు. కోర్టు సన్నివేశాలు, సంభాషణలు ఏదో సెమినార్ ప్రజెంటేషన్‌లా అనిపిస్తాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర కూడా అదే స్థాయిలోనే ఉంటుంది. కుమార్తెను కోల్పోయిన తండ్రి యోగేశ్‌గా శ్రేయాస్ తల్పాడే నటన బాగుంది. చిన్నారి త్రిష నటన కూడా మెప్పిస్తుంది. ఆమె చనిపోయే ముందు పలికే సంభాషణలు ఉద్విగ్నంగా ఉంటాయి.

సాంకేతికంగా సినిమా ఓకే. నిడివి కూడా ఎక్కువ కాదు. క్రిమిసంహారక మందుల వినియోగం అనే పాయింట్ ఆధునిక సమాజ వాస్తవాలను ప్రతిబింబించేలా ఉన్నా, దాన్ని బలమైన ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దడంలో దర్శకుడు తడబడ్డాడు. కుటుంబంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

బలాలు: దర్శకుడు ఎంచుకున్న పాయింట్, సందేశం, క్లైమాక్స్ ప్రజెంటేషన్. బలహీనతలు: రచనలో బలం లేకపోవడం, ఉపన్యాసంలా సాగే కోర్టు సన్నివేశాలు. మొత్తానికి, ‘ది ఇండియా స్టోరీ’ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాన్ని తీసుకున్నప్పటికీ, ప్రజెంటేషన్‌లో తేలిపోయిన చిత్రం.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

రేటింగ్ : 2.5/5