రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ తొలి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ చిత్రం ‘తుడక్కమ్’ ఇటీవల జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. జుడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ గత నెలలో మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. విస్మయతో పాటు ఆశిష్ జో ఆంటోనీ, బాబీ కురియన్, సాయికుమార్, మనోజ్ కె. జయన్, కేబీ గణేశ్ కీలక పాత్రల్లో నటించగా, మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించారు.
కథలో మీనూ (విస్మయ మోహన్‌లాల్) చిన్నప్పుడే తల్లిని కోల్పోతుంది. ఆమెను తండ్రి రవి బాల చంద్రన్ (సాయికుమార్) ఒంటరిగా పెంచుతాడు. రవికి కాళ్లు లేకపోయినా కుమార్తెకు అండగా నిలుస్తూ, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తాడు. మీనూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే, అదే ఊరిలో చిన్న పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతూ జీవితం సాగిస్తుంది. వీఆర్‌వోగా పనిచేస్తున్న రవిని ఒక స్థలానికి సంబంధించిన అనుమతుల విషయంలో కొందరు బెదిరిస్తుంటారు.
ఒక రోజు కాంపిటేటివ్ పరీక్ష రాయడానికి స్నేహితురాలు ప్రియతో కలిసి వెళ్లిన మీనూ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. దీంతో ఆందోళన చెందిన రవి పోలీసుల సహాయం కోరుతాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు కలిసి మీనూను వెతకడం ప్రారంభిస్తారు. మీనూ ఎలా మిస్సైంది? ఆమెకు ఏమైంది? పోలీసులు ఆమెను కనిపెట్టగలిగారా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రేక్షకుడు సినిమా అంతా ఉత్కంఠగా అనుసరించాల్సి ఉంటుంది.
సినీ కుటుంబం నుంచి కొత్తగా వస్తున్న వారసులపై సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మోహన్‌లాల్ కుటుంబం నుంచి విస్మయ వస్తుండటంతో ‘తుడక్కమ్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కుటుంబం, భావోద్వేగం, యాక్షన్, సందేశం – అన్నింటినీ మేళవించి దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ‘2018’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన జుడే ఆంథోని జోసెఫ్ ఈసారి సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లో ప్రయత్నం చేసి చాలా వరకూ విజయవంతమయ్యారు.
అయితే కథా వస్తువు పరిమితంగా ఉండటం, ఆరంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, అనవసరంగా వచ్చిన పాటలు చిత్రానికి కొంతమేర స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. మీనూ, ఆమె తండ్రి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించిన దర్శకుడు ప్రధాన అంశానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. మీనూ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యే దశ నుంచి కథలో ఉత్కంఠ మొదలవుతుంది. ఇక్కడి నుంచి సాగే పోలీసు దర్యాప్తు, సమాంతరంగా మీనూకు ఏమైందన్న విషయాన్ని చూపించే విధానం ప్రేక్షకుడికి సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది.
విరామ సమయానికి మీనూని ఇంటికి చేర్చే సన్నివేశం, ఆ తర్వాత వచ్చే ఊహించని మలుపు కథను రివెంజ్ డ్రామా వైపు మళ్లిస్తుంది. “నిజం పెదవి దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుంది” అన్న చందంగా మీనూకి ఎదురైన పరిస్థితులను చుట్టుపక్కల వారు ఎలా చూస్తారు, సామాజిక మాధ్యమాల్లో ఎలా చర్చిస్తారు అన్నది నేటి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా చూపించారు. మహిళల విషయంలో జరిగే చిన్న తప్పును కూడా బయట ఎలా పెద్దది చేస్తారన్న అంశాన్ని దర్శకుడు స్పష్టంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంలో మోహన్‌లాల్ పాత్ర ద్వారా సందేశాన్ని బలంగా చేరవేయాలన్న ప్రయత్నం కనిపిస్తుంది.
ముఖ్యంగా మహిళలు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి నిలబడినప్పుడే ముందుకు వెళ్లగలరన్న ధైర్యాన్ని నింపే సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్‌లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ భాగంలో విస్మయ యాక్షన్, తనను అంతం చేయడానికి వచ్చిన వారిని ఎదుర్కొనే సన్నివేశాలు థ్రిల్ పంచుతాయి. ఇటీవల వచ్చిన ‘బ్లాస్ట్’ చిత్రంలోని కొన్ని ఛాయలు కనిపించినా, మహిళా సాధికారతను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఆ సన్నివేశాలను మలిచిన తీరు బాగుంది.
నటీనటుల విషయానికి వస్తే – మీనూ పాత్రలో విస్మయ మోహన్‌లాల్ ప్రథమార్ధంలో సాధారణ అమ్మాయిగా సహజంగా కనిపించింది. ద్వితీయార్ధంలో భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. మోహన్‌లాల్ అతిథి పాత్రలో తక్కువ సమయంలోనే ప్రభావం చూపారు. ఆశిష్ జో ఆంటోనీ, బాబీ కురియన్, సాయికుమార్, మనోజ్ కె. జయన్, కేబీ గణేశ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతినాయకుడిగా కనిపించిన అనీశ్ జోయ్ చివరి వరకూ ఒక్క సంభాషణ లేకుండా కళ్లతోనే భయపెట్టే ప్రయత్నం చేశాడు.
సాంకేతికంగా సినిమా సగటు స్థాయిలో ఉంది. నిడివి ఎక్కువగా లేకపోవడం వల్ల బోర్ అనిపించే అవకాశం తక్కువ. ద్వితీయార్ధంలో కథనం వేగం పెరగడం, ఉత్కంఠ నిలకడగా కొనసాగడం చిత్రానికి ప్లస్‌గా మారింది. ఆరంభ సన్నివేశాలు, పాటలు, నెమ్మదిగా సాగే కథనం మాత్రం బలహీనతలుగా భావించవచ్చు.
కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రంగా ‘తుడక్కమ్’ నిలిచింది. జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులు సులభంగా ఆస్వాదించవచ్చు. మొత్తానికి – సందేశాన్ని చేరవేస్తూ, థ్రిల్ పంచే ప్రయత్నం చేసిన ‘తుడక్కమ్’ చూడదగ్గ సర్వైవల్ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రేటింగ్:- 2.75/5







