రాయలసీమ న్యూస్, నంద్యాల: ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో సమీర్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన కేసులో నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
జులై 14వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో ఆళ్లగడ్డ పాత బస్టాండ్ ప్రాంతంలో సమీర్‌పై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
తరువాత ఆళ్లగడ్డ పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న ఏవీ గోదాం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను గుర్తించిన పట్టణ సీఐ నాగరాజారావు, ఎస్సై చిన్న పీరయ్య, సిబ్బంది జులై 22వ తేదీ బుధవారం అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు.
అరెస్టు చేసిన నిందితులు మునగాల పెద్ద ఏల్లాలు, కురుబ వెంకట సుధీర్, తలారి నరేంద్ర, దూదేకుల హుస్సేన్ బాబు దాడి చేసిన విషయాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రెండు మోటార్ బైకులు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.
ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణమని డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.













