నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ప్రణవి తప్పిపోయిన ఘటనలో జిల్లా పోలీసుల అప్రమత్తతతో ఆమెను సురక్షితంగా గుర్తించి తల్లికి అప్పగించారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో చిన్నారి కనిపించకుండా పోవడంతో, ఆమె తల్లి బి. కళ్యాణి రాత్రి 9 గంటలకు డయల్-112 ద్వారా నంద్యాల తాలూకా పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే నంద్యాల పోలీసులు అప్రమత్తమై వైఎస్సార్ నగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి సమయం కావడంతో ప్రతి వీధి, ప్రతి ఇంటి పరిసరాలు, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నారి ఆనవాళ్లు దొరకాలనే లక్ష్యంతో పోలీసులు నిరంతరంగా గాలింపు కొనసాగించారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారి శ్రీ సునీల్ షొరాణ్, IPS సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. నంద్యాల సబ్ డివిజన్ ASP శ్రీమతి సుస్మిత, IPS ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక గాలింపు నిర్వహించారు.

గాలింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అదనంగా డ్రోన్ కెమెరాలు, స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్‌ను వినియోగించి వైఎస్సార్ నగర్ వెలుపల ఉన్న కాలువలు, పొలాలు తదితర ప్రాంతాలను జల్లెడ పట్టారు. రాత్రంతా కొనసాగిన ఈ గాలింపు చర్యలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి.

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలీసుల నిరంతర శ్రమ ఫలితంగా ఈరోజు తెల్లవారుజాము సుమారు 6 గంటలకు వైఎస్సార్ నగర్ వెలుపల ఉన్న పొలాల్లో చిన్నారి ప్రణవిని సురక్షితంగా గుర్తించారు. అనంతరం చిన్నారిని ఆమె తల్లి బి. కళ్యాణికి క్షేమంగా అప్పగించారు. చిన్నారి సురక్షితంగా లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 ద్వారా వెంటనే సమాచారం అందించడం వల్ల పోలీసులు వేగంగా స్పందించి చిన్నారిని సురక్షితంగా గుర్తించగలిగామని ప్రజలు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నాం. ప్రజల భద్రత, రక్షణ కోసం నంద్యాల జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలందిస్తారు.

ఈ గాలింపు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS అభినందించారు. సమయోచితంగా స్పందించి, సమన్వయంతో పనిచేసిన పోలీసు బృందం చర్యల వల్ల చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.