నంద్యాల జిల్లా కల్లూరు మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించారు. బిర్లా గేట్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగించారు.

తరువాత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎల్-నినో ప్రభావంతో కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని, కల్లూరు మండలంలో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులకు సహాయం అందించాలని కాటసాని రామభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

వర్షాలు సకాలంలో పడతాయని నమ్మకంతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి సాగు ప్రారంభించారని, కూలీల ఖర్చులు, విత్తనాలు, ఎరువులు తదితరాలపై ఎక్కువగా వ్యయం చేసిన తర్వాత కీలక దశలో వర్షాలు లేక పంటలు ఎండిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకుండా ప్రభుత్వం ఆలస్యం చేయడం బాధాకరమని విమర్శించారు.

“పంటలు కళ్లముందే ఎండిపోతుంటే కరువు లేదని ఎలా చెబుతారు. పంట పొలాల్లోకి వెళ్లి పరిస్థితిని కళ్లారా పరిశీలిస్తే కరువు తీవ్రత అర్థమవుతుంది” అని కాటసాని రామభూపాల్ రెడ్డి మీడియాతో అన్నారు.

రైతులు పంటల బీమా కోసం తమ వద్ద ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి ప్రీమియం చెల్లించారని, అలాంటి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని ఆయన సూచించారు. రైతులకు బీమా, నష్టపరిహారం, కరువు సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యవసాయ అధికారులతో మాట్లాడినప్పుడు, కల్లూరు మండలంలో వర్షపాతం లోటు 65 శాతానికి పైగా నమోదైందని, కరువు మండలంగా ప్రకటించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపించామని అధికారులు చెప్పారని కాటసాని వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నమోదైన వర్షపాతం లోటును పరిగణనలోకి తీసుకుని నివేదికలు పంపినా, ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం ప్రశ్నార్ధకమని వ్యాఖ్యానించారు.

“అధికారులు తమ పరిధిలో నివేదిక పంపించామని చెబుతున్నారు. మరి ఆ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? కల్లూరు పట్టణానికి సమీపంలోని కొన్ని గ్రామాలను మాత్రమే చూసి మొత్తం మండలంపై కరువు లేదని ఎలా నిర్ణయిస్తారు? ఉల్లిందకొండ, చెట్లమలాపురం, పెద్దటేకూరు, చిన్నటేకూరు, తడకనపల్లి, బస్తిపాడు, కొంగనపాడు వంటి గ్రామాల్లో రైతుల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తే అసలు స్థితిగతులు తెలుస్తాయి. అక్కడ పంటలు బాగా పండాయని, రైతులు నష్టపోలేదని నిరూపిస్తే కరువు మండలం కోసం మేము చేస్తున్న పోరాటం తప్పని ఒప్పుకుంటాం. కానీ కార్యాలయాల్లో కూర్చొని లెక్కలు చూసి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు” అని ఆయన అన్నారు.

గతంలో నీటి వనరులను సమర్థంగా వినియోగించి గ్రామాల్లో తాగునీటి అవసరాలతో పాటు పంట పొలాలకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకున్నామని, బోర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీరు నిల్వ ఉండేలా చేసిన ప్రయత్నాల వల్ల గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా, పంటలకు కూడా కొంత మేర నీరు అందేదని కాటసాని గుర్తు చేశారు. ప్రస్తుతం నీటి వనరులు ఉన్నప్పటికీ రైతుల పొలాలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొనడం పట్ల ఆయన ఆక్షేపించారు.

“వైఎస్సార్‌సీపీకి రాజకీయంగా చేయాల్సింది ఏమీ లేక రైతుల సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నామని అధికార పార్టీ విమర్శించడం హాస్యాస్పదం. రైతుల పంటలు ఎండిపోతుంటే మానవత్వంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కరువు ప్రకటన వల్ల రైతులకు నష్టపరిహారం, బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి ప్రభుత్వ సహాయం అందే అవకాశం ఉంటుంది. అందుకే రైతుల ప్రయోజనాల కోసం కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం” అని కాటసాని స్పష్టం చేశారు.

“చంద్రబాబు నాయుడుగారికి వర్షాలు కురిపించేంత శక్తి ఉందని చెబుతున్నారుగా. నిజంగానే అంత శక్తి ఉంటే కర్నూలుకు వచ్చి వర్షాలు కురిపించండి, రైతుల పంటలను కాపాడండి. ఆయన వర్షాలు కురిపిస్తే పార్టీ భేదాలు మర్చిపోయి మేమే ముందుగా అభినందిస్తాం” అని కాటసాని అన్నారు.

రైతుల కష్టాలు కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కాటసాని రామభూపాల్ రెడ్డి హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కల్లూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.