రాయలసీమ న్యూస్, నంద్యాల: నందికొట్కూరు:- ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు వరకు ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నీటి పైప్‌లైన్ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యత ప్రమాణాలకు ఎటువంటి విఘాతం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం నందికొట్కూరు పట్టణ పరిధిలో ముచ్చుమర్రి–ఓర్వకల్లు పైప్‌లైన్ పనుల పురోగతిని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏబీఎం పాలెం వద్ద జరుగుతున్న పైప్‌లైన్ ఏర్పాటు, నిర్మాణ నాణ్యత, సాంకేతిక అంశాలు, పనుల వేగం తదితర విషయాలపైలోనే సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు అమలు సమయంలో ఎదురవుతున్న సమస్యలు, అవరోధాలపై కూడా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి దశ పనిని సమగ్రంగా పర్యవేక్షించాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరా, పారిశ్రామిక అవసరాల పరంగా ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆమె అధికారులకు గుర్తుచేశారు. పనులను ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో నిర్వహించి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు.
తరువాత నందికొట్కూరు ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి, వాటి పూర్తి కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆమె సూచించారు.
ముఖ్యంగా పైప్‌లైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు అమలులో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, సంబంధిత శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
ఈ సమీక్షా సమావేశంలో APIIC జోన్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఆత్మకూరు ఆర్‌డీవో వెంకటశివ, నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.













