రాయలసీమ న్యూస్, నంద్యాల: శ్రీశైలం: శ్రీశైలంలో ఏపి టూరిజం ఆధ్వర్యంలో నడుస్తున్న రోప్ వే సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పాతాళగంగకు మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు ఈ రోప్ వే ద్వారా తీగ మార్గంలో ప్రయాణించి పాతాళగంగ వద్దకు చేరుకుని పుణ్య స్నానాలు చేసేవారు. ప్రస్తుతం రోప్ వే నిర్మాణం పూర్తై సుమారు 20 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో భద్రతా ప్రమాణాల దృష్ట్యా మెకానికల్ మెయింటెనెన్స్ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా పాతాళగంగకు వెళ్లే రోప్ వే సర్వీసులను సుమారు 30 రోజుల పాటు నిలిపివేశారు. ఈ కాలంలో రోప్ వేలోని క్యాబిన్లు, రోపులు, యంత్రాంగంపై మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. రోప్ వే వ్యవస్థ మొత్తం సురక్షితంగా ఉండేలా అవసరమైన సాంకేతిక మరమ్మతులు, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏపి టూరిజం అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం శ్రీశైలానికి భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గిన నేపథ్యంలోనే ఈ మెయింటెనెన్స్ పనులను చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. రానున్న మరో పది సంవత్సరాల పాటు టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ మెకానికల్ మరమ్మతు పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.
రోప్ వే సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన కారణంగా భక్తులు మెట్ల మార్గం ద్వారా పాతాళగంగకు చేరుకోవాల్సి వస్తోంది. ఈ అసౌకర్యాన్ని భక్తులు సహనంతో స్వీకరించాలని, భద్రత కోసం చేపట్టిన ఈ పనులకు సహకరించాలని అధికారులు కోరారు.
భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రోప్ వే మెకానికల్ మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నాం. రానున్న సంవత్సరాల్లో ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు మరమ్మతులు చేస్తున్నాం. ఈ కాలంలో రోప్ వే సేవలు నిలిపివేతకు భక్తులు సహకరించాలని కోరుతున్నాం.
ఈ మేరకు అధికారులు ప్రెస్ నోట్ ద్వారా సమాచారం విడుదల చేశారు. మెయింటెనెన్స్ పనులు పూర్తయ్యాక రోప్ వే సేవలను తిరిగి ప్రారంభించే తేదీని తరువాత ప్రకటించనున్నట్లు తెలిపారు.













