రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: ఢిల్లీ హైకోర్టు గ్యాంగ్ రేప్ కేసుల విషయంలో కీలకమైన, దూరప్రభావాలు కలిగించే తీర్పు వెలువరించింది. ఒక మహిళ స్వయంగా లైంగిక దాడికి పాల్పడకపోయినా, ఉమ్మడి కుట్రలో భాగమై బాధితురాలిపై అత్యాచారం జరిగేలా సహకరిస్తే, ఆమెపై కూడా గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ ఈ తీర్పు ఇస్తూ, చట్టంలోని "వ్యక్తులు" అనే పదం కేవలం పురుషులకే పరిమితమని భావించడానికి ఎలాంటి హేతుబద్ధత లేదని పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376D, అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 70 పరిధిలో ఈ నిర్ణయం ఇచ్చారు.
ఈ కేసులో ఒక మహిళ తన మైనర్ కూతురిని బెదిరించి, మరో వ్యక్తితో లైంగిక సంబంధానికి ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన సెక్షన్లు అమలు చేయడాన్ని ప్రశ్నిస్తూ, తాను మహిళనని, అందువల్ల గ్యాంగ్ రేప్ సెక్షన్లు వర్తించవని వాదిస్తూ ఆ తల్లి హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, గ్యాంగ్ రేప్ నేరంలో "వ్యక్తులు" అనే పదాన్ని లింగ పరంగా పరిమితం చేయలేమని స్పష్టం చేసింది. నేరానికి ఉమ్మడి కుట్ర, సహకారం, బాధితురాలిపై అత్యాచారం జరిగేలా చేసే చర్యల్లో భాగస్వామ్యం ఉంటే, ఆ వ్యక్తి పురుషుడా, మహిళా అన్నది ముఖ్యం కాదని కోర్టు తేల్చింది.
అయితే, ఒక మహిళ ఒంటరిగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడితే ఈ సెక్షన్ వర్తించదని, గ్యాంగ్ రేప్ నిర్వచనంలో "గ్రూప్" అనే అంశం కీలకమని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే, మహిళ గ్యాంగ్‌లో భాగమై, ఇతరులతో కలిసి లేదా వారికి సహకరిస్తూ నేరం జరిగేలా చేస్తేనే గ్యాంగ్ రేప్ సెక్షన్లు ఆమెపై అమలు చేయవచ్చని కోర్టు పేర్కొంది.
ఈ తీర్పుతో గ్యాంగ్ రేప్ కేసుల్లో పాత్ర పోషించే మహిళల బాధ్యత, చట్టపరమైన పరిణామాలపై స్పష్టత వచ్చింది. లైంగిక నేరాల్లో సహకారం, కుట్ర, బాధితురాలిని బలవంతం చేసే చర్యలన్నీ సమానంగా పరిగణించబడతాయని, లింగ ఆధారంగా మినహాయింపులు ఉండవని ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయంతో సంకేతం ఇచ్చినట్టుగా న్యాయవర్గాలు భావిస్తున్నాయి.







