రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సి ఉందని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు కక్షిదారులు రాతపూర్వక వాంగ్మూలాలు సమర్పించాలని ఆదేశించింది.
ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై 2023లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సభ్యత్వం లేకుండా నియామక ప్రక్రియను అమలు చేయడానికి ఆ చట్టంలో నిబంధనలు చేశారు. ఆ చట్టం ప్రకారం ప్రధాని, ప్రధాని ప్రతిపాదించిన ఒక కేంద్ర మంత్రి, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషనర్ల నియామక బాధ్యతను నిర్వహిస్తుంది.
ఈ చట్టాన్ని కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, Association for Democratic Reformsతో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వీరి పిటిషన్లన్నింటినీ కలిపి విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు పూర్తిచేసి తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ సందర్భంగా ఈ కీలక రాజ్యాంగ అంశంపై విస్తృత ధర్మాసనం విచారణ జరపాలని సిఫారసు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
‘‘ప్రజాస్వామ్యంపై అవిశ్వాసం తగదు’’
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులను Solicitor General తుషార్ మెహతా బలంగా సమర్థించారు. ఎంపిక ప్యానెల్లో సంఖ్యాబలం ఉన్నంత మాత్రానే ప్రధాని, కేంద్ర మంత్రులు ప్రజాస్వామ్యంపై అవిశ్వాసంతో వ్యవహరిస్తారని భావించడం సరైంది కాదని ఆయన సుప్రీంకోర్టులో వాదించారు.
ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక ప్రత్యేక పవిత్రత ఆపాదించబడిందని, ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్ నిర్ణయాలను అనుమానంతో చూడడం రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉంచిన విశ్వాసాన్ని తగ్గించడమేనని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు.
‘‘ప్రధాని నిర్ణయంపై నమ్మకం లేకపోతే, అవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలని అనుకుంటే కేబినెట్ మంత్రుల ఎంపిక తరువాత కూడా మాజీ న్యాయమూర్తులనో, ఇంకొకరినో సంప్రదించాలన్న వెసలుబాటు ఎందుకు లేదు’’
అని ఆయన ప్రశ్నించారు. ఎంపిక ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటున్నాయన్న వాదనలను కేంద్రం తరఫున ఆయన ఖండించారు. పిటిషనర్ల వాదనలు, కేంద్ర ప్రభుత్వ సమాధానాలన్నింటినీ పరిశీలించిన అనంతరం ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనం ముందుకు పంపాలన్న అభిప్రాయంతో ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.







