రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
బావిలో పడిన ఎద్దును రక్షించబోయి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
బావిలో పడిన ఎద్దును రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఖరమ్‌సేడ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలోని ఓ బావిలో రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోయింది. దానిని బయటకు తీశేందుకు గ్రామస్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తాడు సాయంతో సుమారు 40 అడుగుల లోతు ఉన్న బావిలోకి దిగారు. అయితే కొంతసేపు గడిచినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో పరిస్థితిని అర్థం చేసుకోలేక మరో ఇద్దరు కూడా బావిలోకి దిగారు. కొద్ది నిమిషాల తర్వాత వారిలో ఎవ్వరూ బయటకు రాకపోవడంతో బావిలోపల ఏదో ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని స్థానికులు గ్రహించారు. వెంటనే ఇతరులు తాళ్లు, కొక్కాల సాయంతో రక్షణ చర్యలు ప్రారంభించారు.
సుమారు మూడు గంటల పాటు కొనసాగిన శ్రమ తర్వాత బావిలో ఉన్న నలుగురిని బయటకు తీశారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ముగ్గురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
మృతులను ఖరమ్‌సేడ గ్రామానికి చెందిన రాహుల్ యాదవ్ (36), వీరేంద్ర యాదవ్ (40), కృష్ణదత్ యాదవ్ (26)గా గుర్తించారు. ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి వివరాలు వెల్లడించలేదు.
చాలాకాలంగా ఆ బావి మూసి ఉండడంతో అందులో చెత్త, మురుగు పేరుకుపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. బావిలో విషవాయువులు పేరుకుపోయి ఉండటం వల్ల అందులోకి దిగినవారు ఊపిరాడక మృతిచెందిన అవకాశముందని అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బావి వినియోగం, నిర్వహణ, భద్రతా చర్యలపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రామంలో ఒక్కసారిగా ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.







