రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
హర్యానా లోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మరణించారు. స్థానికంగా ఒక వ్యాపారి ఇంటి ముందు గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌యూవీలో కొందరు సాయుధులైన వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో, పోలీసులు సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈ క్రమంలో వ్యాపారి ఇంటిముందు గ్యాంగ్‌స్టర్లు అత్యాధునిక తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మరణించగా ఒక క్రిమినల్ గాయపడ్డాడు. ముగ్గురు పోలీసులకు కూడా తూటా గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా ఆ వ్యాపారికి విదేశీ గ్యాంగ్‌ల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు.
ఈ ఉదంతంలో కాల్పులకు తెగబడ్డ వారి వివరాలు, వారి నేర చరిత్ర గురించి త్వరలో వెల్లడిస్తామని పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. ఘటనా స్థలంలో ఫారెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని అన్నారు. నిందితుల నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.







