13 నౌకల్లో హోర్ముజ్‌లో చిక్కుకున్న

562 మంది భారత నావికులు

న్యూఢిల్లీ : హోర్ముజ్‌ జలసంధిలో భారతీయ పతాకాలతో ప్రయాణిస్తున్న 13 వాణిజ్య నౌకలు గత 108 రోజులుగా అక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి. ఈ నౌకల్లో మొత్తం 562 మంది భారత నావికులు చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జలసంధి పశ్చిమ భాగంలో నిలిచివున్న నౌకల్లో 329 మంది, తూర్పు భాగంలో ఉన్న నౌకల్లో 233 మంది నావికులు ఉన్నారని అధికారిక సమాచారం తెలిపింది. మూడు నెలలకుపైగా సముద్ర మధ్యలోనే నౌకల్లో ఇరుక్కుపోయిన ఈ నావికుల జీవితం దుర్భరంగా మారింది.

ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నౌకలను కదిలించేందుకు కెప్టెన్లు, సిబ్బంది వెనుకాడుతున్నట్లు సమాచారం. నౌకలను ఎటు మళ్లించినా క్షిపణి దాడులు, ఇతర ప్రమాదాల భయం వెంటాడుతుండటంతో, నావికులు నౌకలను ప్రస్తుతం ఉన్న స్థానాల నుంచి కదిలించకుండా కాలం గడుపుతున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒమన్‌ తీరానికి సమీపంలోని దఖమ్‌ పోర్టు వద్ద నిలిపివుంచిన NT Celestial అనే నౌకలో పనిచేస్తున్న నిషాంత్‌ ఉర్తనాథన్‌ అనే భారత నావికుడు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. అతని మృతదేహాన్ని తక్షణం భారత్‌కు తరలించే అవకాశం లేకపోవడంతో, అది కుళ్లిపోకుండా ఉండేందుకు తోటి నావికులు చల్లని ఉప్పునీటిలో భద్రపరిచినట్లు సమాచారం అందింది.

ఇక మరో ఘటనలో, ఒమన్‌ తీర ప్రాంతంలోనే ఉన్న Virat-1 అనే నౌక ఇంజన్‌ లోపం కారణంగా ఆదివారం సముద్రంలో మునిగిపోయింది. ఈ నౌకలో ఉన్న 14 మంది భారత నావికులను ఒమన్‌ కోస్ట్‌గార్డు సిబ్బంది సమయానికి స్పందించి సురక్షితంగా రక్షించారు. నౌక మాత్రం పూర్తిగా మునిగిపోయినట్లు అక్కడి వర్గాలు తెలిపాయి. హోర్ముజ్‌ జలసంధి ప్రపంచ వాణిజ్య రవాణాలో కీలక మార్గం కావడంతో, అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం సముద్ర రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, అక్కడ చిక్కుకుపోయిన భారత నావికుల సురక్షిత తిరుగు ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం సంబంధిత దేశాలతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు విదేశాంగ వర్గాలు సూచిస్తున్నాయి.