రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
రాజస్థాన్ జైపుర్‌లోని చందవాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కాగా.. కూలీలతో సహా 12 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బేస్మెంట్‌లో ఎస్‌టీపీ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు అధికారులు. శిథిలాల్లో చిక్కుకున్న మరి కొందరు కార్మికుల కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక జిల్లా కలెక్టర్ సందేశ్ నాయక్ సహా ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.







