జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతమైన డోడా, కిష్త్వార్ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరగడంతో వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. మంగళవారం డోడా జిల్లాలోని తాత్రి పట్టణం పరిసరాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద నీరు, బండరాళ్లు తాత్రి పట్టణాన్ని ముంచెత్తాయి.

వరదల ప్రభావంతో తాత్రి పట్టణంలో రోడ్డుపక్కన నిలిపిన అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. కొన్ని వాహనాలు చీనాబ్ నదిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. అలాగే వరద నీరు, బండరాళ్లు ఇళ్లలోకి, దుకాణాల్లోకి చేరడంతో పలు నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనల్లో ప్రాణనష్టం ఏదీ సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.

గత రెండు రోజులుగా డోడా, కిష్త్వార్ జిల్లాల్లో వరుసగా ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో ఇది మూడోసారి వరదలు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. కొండచరియలు విరిగిపడటం, వరద నీరు ఊహించని వేగంతో రావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం సూచిస్తోంది.

మంగళవారం సంభవించిన వరదల కారణంగా డోడా-కిష్త్వార్ జాతీయ రహదారి తాత్రి వద్ద పూర్తిగా మూసుకుపోయింది. రహదారిపై మట్టి, బండరాళ్లు పేరుకుపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రెండు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతింది. రహదారిని పునరుద్ధరించేందుకు సంబంధిత శాఖ అధికారులు యంత్రాలను రంగంలోకి దించి శుభ్రపరిచే పనులు ప్రారంభించారు.

వరదల వల్ల జరిగిన నష్టం ఎంత మేరకు ఉందనే విషయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇళ్లకు, దుకాణాలకు, వాహనాలకు జరిగిన నష్టంపై ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాతే అధికారిక గణాంకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వదంతులు, అపోహలు నమ్మవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆకస్మిక వరదల నేపథ్యంలో వివిధ రకాల సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించని సమాచారాన్ని నమ్మి గందరగోళానికి లోనుకాకూడదని అధికారులు సూచిస్తున్నారు.

జమ్మూకశ్మీర్ డోడా జిల్లా డిప్యూటీ కమిషనర్ కృష్ణన్ లాల్ ప్రజలను అధికారిక సమాచారం కోసం మాత్రమే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు. వర్షాలు, వరదల పరిస్థితిపై తాజా సమాచారం కోసం జిల్లా కంట్రోల్ రూం, సంబంధిత శాఖలను సంప్రదించాలంటూ ఆయన సూచించారు.