రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: ఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ‘ఓటు చోర్.. గడ్డీ చోడ్’ అంటూ, ‘జ్ఞానేష్ దిగిపో’ నినాదాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మార్మోగుతున్నాయి. ‘జ్ఞానూ.. ఇట్స్ డన్ బ్రో’ అంటూ యువత నినాదాలు బెంగళూరు, ఢిల్లీ, బీహార్, హైదరాబాద్, భువనేశ్వర్, త్రిపుర తదితర ప్రాంతాల్లో వినిపించాయి.
వరుసగా మూడో రోజూ దాదాపు 300 మంది ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, సిపిఎం, వామపక్షాలతో పాటు ఇండియా వేదికలోని పార్టీలతోపాటు బిజెడి సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు, నేతలు నిరసనలకు చేరారు.
ఢిల్లీలో మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద గురువారం ఇండియా బ్లాక్ ఎంపీలు, వేలాది మంది కార్యకర్తలు శాంతియుత నిరసన నిర్వహించారు. గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బిజెపి ప్రభుత్వం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ‘విజ్ఞత’ కలగాలని ప్రార్థించారు. అనంతరం నేతలు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. శుక్రవారం కూడా ఆందోళన కొనసాగుతుందని, ఉదయం పార్లమెంట్ హౌస్ వద్ద సమావేశం అయ్యే అవకాశం ఉందని ప్రతిపక్ష నేతలు తెలిపారు.
ఈ నిరసనలకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభలో సిపిఎం పక్ష నేత జాన్ బ్రిట్టాస్, ఎంపీలు వి.శివదాసన్, ఎ.ఎ.రహీం, రాజ్యసభలో సిపిఐ పక్ష నేత పి.సంతోష్‌కుమార్, ఆర్‌జెడి ఎంపి మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అభిషేక్ బెనర్జీ, వయనాడ్ ఎంపి ప్రియాంకగాంధీ తదితరులు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, ఓట్ల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, తప్పులు చేసినవారు రాజీనామాలు చేయాలని, ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై జవాబుదారీ వహించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ కనాట్‌ప్లేస్‌లోని మొహెట్స్ హోటల్ నుంచి మూడు బస్సుల్లో ఎంపీలు రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఆ బస్సులను అనుసరిస్తూ వేలాది మంది కార్యకర్తలు కాలినడకన రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. జ్ఞానేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించినప్పటికీ గత రెండు రోజుల మాదిరిగానే గురువారం నిరసనకారులను రాజ్‌ఘాట్‌లోకి అనుమతించారు. మింటో రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, అనంతరం పోలీసులు వెనక్కి తగ్గారు.
బెంగళూరు ఫ్రీడమ్ పార్కులో జరిగిన భారీ సభకు అబిజిత్ దీప్కే సహా సిజెపి అగ్రనేతలు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సినీ నటుడు ప్రకాష్‌రాజ్, కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల్ గౌడ తదితరులు హాజరయ్యారు. మతోన్మాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గౌరీ లంకేష్ సోదరి, చిత్ర నిర్మాత కవిత లంకేష్ సభలో మాట్లాడుతూ అభిజిత్ దీప్కేను తన దత్తపుత్రుడిగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ నిరసనల్లో దాడికి గురైన మహిళలకు సంఘీభావంగా ఇదే సభలో యువతులు చెప్పులతో నిరసన తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాలని, మహిళలపై హింసను అంతం చేయాలని నినదించారు. లంకేష్, ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారంతా ఈ ర్యాలీలో పాల్గొనడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
బీహార్‌లో ‘చలో లోక్‌భవన్’ పాదయాత్రను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో ప్రతిపక్ష నేత, ఆర్‌జెడి వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ బారికేడ్లు దాటి ముందుకు వెళ్లారు. అనంతరం గవర్నర్ సయ్యద్ అత హుస్సేన్‌ను కలిసేందుకు ఇండియా వేదిక ప్రతినిధి బృందాన్ని అనుమతించారు. పోలీసుల అడ్డగింతలో సిపిఐ (ఎంఎల్) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అజిత్ కుష్వాహా స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. నిరసన సమయంలో బీహార్ బిజెపి అధ్యక్షుడు సంజయ్ అరోగి అక్కడకు రావడంతో ఆయనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
హైదరాబాద్‌లో ‘చలో లోక్‌భవన్’ ర్యాలీకి వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకోవడంతోపాటు మంత్రులు సహా పలువురిని అరెస్టు చేశారు. భువనేశ్వర్‌లోనూ ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం నిర్వహించి ప్రతిపక్ష నేతలు నిరసన తెలిపారు. త్రిపురతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా జ్ఞానేష్‌కుమార్ రాజీనామా, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోరుతూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావాలని భావిస్తున్నామని, అందుకోసం ఆమె అప్పాయింట్‌మెంట్‌ను కోరామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 2న తొలిసారిగా అభ్యర్థించామని, సమావేశానికి వచ్చే నేతల పేర్లను ఇవ్వాలని రాష్ట్రపతి భవన్ కోరిందని చెప్పారు. తిరిగి పేర్ల జాబితాతో 5వ తేదీన పంపామని, శుక్రవారం వరకు వేచి ఉంటామని వెల్లడించారు.
శుక్రవారం జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసనల నేపథ్యంలో సిజెపి, ఎఐఎస్ఎ, ఇతర విద్యార్థి సంఘాలు సిఇసికి వ్యతిరేకంగా సమైక్య సమీకరణకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ ఆందోళనలతో ఎన్నికల వ్యవస్థ, ప్రధాన ఎన్నికల కమిషనర్ పాత్రపై రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.







