రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
కేరళ సీఎం సతీశన్‌కు బెదిరింపులు
అట్టింగల్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ భద్రతపై శనివారం ఉదయం తిరువనంతపురంలో తీవ్ర ఆందోళన నెలకొంది. సీఎం సతీశన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను హతమార్చేస్తానంటూ ఓ వ్యక్తి నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, శుక్రవారం సాయంత్రం సుమారు 6:50 గంటల సమయంలో తిరువనంతపురం సిటీ డిస్ట్రిక్ట్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వీడీ సతీశన్ మరియు ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానని హెచ్చరించాడు. డ్యూటీలో ఉన్న అధికారి కారణం ఏమిటని అడగగా, ఆ వ్యక్తి నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
నాకు సతీషన్ అంటే నచ్చదు, అందుకే చంపుతా
అంతటితో ఆగకుండా, అదే వ్యక్తి మూడు నిమిషాల వ్యవధిలో, అంటే సాయంత్రం 6:53 గంటలకు మళ్లీ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశాడు. మరోసారి హత్య బెదిరింపులు చేయడంతో పాటు, కాల్ అటెండ్ చేసిన పోలీస్ అధికారిని అసభ్య పదజాలంతో దూషించాడు. అలాగే, ముఖ్యమంత్రి భద్రతపై ప్రశ్నిస్తూ, తాము సరైన రక్షణ ఏర్పాట్లు చేశామా లేదా అని పోలీసులను సవాల్ చేసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రికి మీరు సరైన రక్షణ ఏర్పాట్లు చేశారా లేదా?
ఈ పరిణామాలపై కంటోన్మెంట్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ చేసిన నంబర్ ఆధారంగా సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడి వివరాలను గుర్తించారు. విచారణలో అతడు తిరువనంతపురం సమీపంలోని అట్టింగల్‌కు చెందిన సోనీ థామస్‌గా తేలింది.
శనివారం ఉదయం పోలీసులు సోనీ థామస్‌ను పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నారు. ఫోన్ కాల్‌లు చేసిన సమయంలో అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. నిందితుడిపై సంబంధిత నేర విభాగాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సోనీ థామస్‌ను రిమాండ్ నిమిత్తం త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించిన అంశం కావడంతో కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.







