పీసీఎఫ్‌ సాంకేతికతపై మద్రాస్‌ ఐఐటీలో పరిశోధన కేంద్రం

దేశంలో తొలిసారిగా ప్లాంట్‌ సెల్‌ ఫెర్మెంటేషన్‌ (పీసీఎఫ్‌) సాంకేతికతపై ప్రత్యేక పరిశోధనల కోసం మద్రాస్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ మద్రాస్‌ – ఐఐటీఎం)లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐఐటీఎం, హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కేంద్రం ఈ నెల 22న అధికారికంగా ప్రారంభమైంది.

పీసీఎఫ్‌ సాంకేతికత ద్వారా మొక్కల కణాలను ప్రయోగశాలలలో నియంత్రిత పరిస్థితుల్లో పెంచి, వాటి నుంచి విలువైన జీవక్రియ పదార్థాలను పొందుతారు. ఈ విధానంతో క్యాన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు అవసరమైన ఔషధాల తయారీకి తోడు, సౌందర్య సాధనాలు, ఆరోగ్యానికి మేలు చేసే ఫైటోకెమికల్స్‌, సుగంధ ద్రవ్యాలు, సువాసనల కోసం ఉపయోగించే పదార్థాలను కూడా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సాంప్రదాయ పద్ధతుల్లో ఈ పదార్థాల కోసం పెద్దఎత్తున మొక్కలను నరికివేయాల్సి వస్తుంది. అయితే పీసీఎఫ్‌ సాంకేతికతలో ప్రయోగశాలలలోనే కణాలను పెంచడం వల్ల అడవుల నరికివేతను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో కణాల పెంపకం జరగడం వల్ల పర్యావరణ పరిరక్షణకు తోడు, స్థిరమైన ఉత్పత్తి సామర్థ్యం కూడా సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

భావితరాల ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా మొక్కల ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి ఈ కేంద్రం కీలకంగా దోహదపడుతుందని ఐఐటీఎం డీన్‌ (అలుమ్ని, కార్పొరేట్‌ రిలేషన్స్‌) ప్రొఫెసర్‌ అశ్విన్‌ మహాలింగం తెలిపారు. పీసీఎఫ్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి, పరిశ్రమలతో అనుసంధానం, కొత్త ఉత్పత్తుల రూపకల్పన వంటి అంశాల్లో ఈ కేంద్రం ప్రధాన పాత్ర పోషించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో హెర్బాలైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ ఖన్నా, కంపెనీ ఉపాధ్యక్షుడు (స్ట్రాటజీ) ఉదయ ప్రకాశ్‌, హిమాలయ వెల్నెస్‌ కంపెనీ ఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌ డాక్టర్‌ యూవీ బాబు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యంతో దేశీయంగా ప్లాంట్‌ సెల్‌ ఫెర్మెంటేషన్‌ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ కేంద్రం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.