రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
జులై 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు అమలు.. టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500 జరిమానా
భారతీయ రైల్వే కొత్త నిబంధనలను ప్రకటించింది. టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించే వారిపై విధించే జరిమానాను గణనీయంగా పెంచింది. ఇప్పటివరకు రూ.250గా ఉన్న జరిమానాను రూ.500కు పెంచుతూ సవరించిన నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం చెల్లుబాటు కాని టికెట్ లేదా ఇప్పటికే వినియోగించిన టికెట్‌తో మళ్లీ రైలు ప్రయాణం చేస్తే, ఆ ప్రయాణానికి సంబంధించిన టికెట్ ఛార్జీలతో పాటు అదనంగా రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ తరహా ఉల్లంఘనలకు రూ.250 మాత్రమే విధించగా, ఇప్పుడు దానిని రెట్టింపు చేశారు.
ఇతరుల పేరుపై బుక్ చేసిన టికెట్‌తో ప్రయాణించినా ఆ టికెట్ చెల్లుబాటు కానిదిగానే పరిగణిస్తారు. అలాంటి ప్రయాణికుడు కూడా రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జరిమానా చెల్లించేందుకు నిరాకరిస్తే సంబంధిత ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రైల్వే స్పష్టం చేసింది.
రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అనుమతి లేకుండా తినుబండారాలు, ఇతర వస్తువులు విక్రయించడాన్ని రైల్వే నిషేధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే విక్రేతలపై రూ.2 వేల వరకు జరిమానా విధించనున్నారు. అలాగే రైల్వే కోచ్‌లలో, స్టేషన్లలో భిక్షాటన పూర్తిగా నిషేధించబడింది. ఏడాది కాలంలో పదేపదే రైల్వే నిబంధనలను ఉల్లంఘించే వారిపై జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
రైల్వే స్టేషన్లో లేదా రైలు ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడం వంటి చర్యలపై కూడా కఠినంగా వ్యవహరించనున్నారు. ఇలాంటి ప్రవర్తనకు పాల్పడిన వారిపై భారీ జరిమానాలు విధించేందుకు నిబంధనల్లో provision కల్పించారు.
మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన బెర్త్‌లు, కోచ్‌లలో అనుమతి లేకుండా పురుషులు ప్రవేశించినా జరిమానా తప్పదని రైల్వే హెచ్చరించింది. ఈ తరహా ఉల్లంఘనలకు రూ.2500 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని నిబంధనల్లో పేర్కొంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం, క్రమశిక్షణ దృష్ట్యా ఈ మార్పులు చేస్తున్నట్టు రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి.







