రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ప్రముఖ సినీ గాయని ఎస్.జానకి కన్నుమూశారు. మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. వయోధిక సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు మనవరాలు అప్సర విద్యుల ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. దక్షిణ భారత గానకోకిలగా పేరుగాంచిన జానకి అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 వేలకు పైగా పాటలను పాడారు.
1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో ఎస్.జానకి జన్మించారు. తెలుగు చలన చిత్రసీమలో ఆణిముత్యాల్లాంటి పాటలకు ఆమె ప్రాణం పోశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అద్భుతమైన పాటలను ఆలపించారు. ఆమె గాన మాధుర్యానికి నాలుగు జాతీయ అవార్డులు సహా, వివిధ సినీ అవార్డులు వరించాయి. సంగీత ప్రపంచానికి జానకి చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 2013లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. లెజెండరీ గాయకులు ఘంటసాల నుంచి బాలసుబ్రహ్మణ్యం వరకూ ఎంతో మంది గాయనీ గాయకులతో కలిసి ఎస్.జానకి అద్భుత గీతాలతో అలరించారు.
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని పాటలను ఎస్.జానకి ఆలపించారు. తొలిసారి మిమ్మల్ని (శ్రీవారికి ప్రేమలేఖ), మంచు కురిసే వేళలో (అభినందన), అరె ఏమైందీ (ఆరాధన), బంతి చామంతి (అభిలాష), సిరిమల్లె పువ్వా (పదహారేళ్ల వయసు), మౌనమేలనోయి (సాగర సంగమం), ప్రియతమా నా హృదయమా (ప్రేమ), అందాలలో (జగదేకవీరుడు అతిలోకసుందరి), ఈ దుర్యోధన దుశ్శాసన (ప్రతిఘటన), మాటే మంత్రము (సీతాకోకచిలుక), సుందరి నీవే (దళపతి- తెలుగు వెర్షన్) వంటి సూపర్‌హిట్ సాంగ్స్ పాడారు.
‘‘ప్రియమైన అమ్మమ్మ, దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూశారన్న వార్త తెలియజేయడానికి ఎంతో విచారిస్తున్నా. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయత మధ్య ప్రశాంతంగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె అద్భుతమైన జీవితాన్ని గడిపారు. తన గానంతో లక్షల మందికి ఆనందింపజేశారు. ఆమె ఒక దిగ్గజ గాయని. ఆమె పాటలు మధుర జ్ఞాపకాలు. ఈ దుఃఖ సమయంలో మా కుటుంబ ఏకాంతతను గౌరవించాల్సిందిగా అందరినీ కోరుతున్నా’’ అని అప్సర తెలిపారు.







