రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
భార్య వివాహేతర సంబంధం రుజువైతే మధ్యంతర జీవనం నిలిపివేత: సుప్రీం కోర్టు
న్యూ ఢిల్లీ,: భార్య వివాహేతర సంబంధంలో ఉందనే అంశాన్ని భర్త ప్రాథమిక దశలోనే తగిన ఆధారాలతో నిరూపించగలిగితే, ఆమెకు మంజూరు చేసే మధ్యంతర జీవనభృతిని నిరాకరించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125(4)లోని నిబంధనలను విశ్లేషిస్తూ సుప్రీం కోర్టు ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో, భర్త సమర్పించిన ఆధారాలు భార్య వ్యభిచార బంధాన్ని ప్రాథమికంగా రుజువు చేస్తున్నట్లయితే, ఆ అంశాన్ని చివరి విచారణ దశ వరకు వాయిదా వేయకుండా మధ్యంతర దశలోనే పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు తేల్చింది. Ex-facie evidence ఆధారంగా వ్యభిచార బంధం ప్రాథమికంగా నిరూపితమైతే, సెక్షన్ 125 కింద మధ్యంతర జీవనభృతి హక్కు ప్రశ్నార్థకమవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
రాజస్థాన్‌కు చెందిన హిమాంశు చోర్డియా 2014లో వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా 2020లో ఆయన భార్య తమ బిడ్డతో కలిసి అత్తవారింటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఆమె జీవనభృతి కోరుతూ Cr.P.C. సెక్షన్ 125 కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై స్పందించిన హిమాంశు చోర్డియా, తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధంలో ఉందని, అందువల్ల సెక్షన్ 125(4) ప్రకారం ఆమెకు జీవనభృతి పొందే హక్కు లేదని కోర్టులో వాదించారు. తన వాదనకు మద్దతుగా కొన్ని ఛాయా చిత్రాలు, ఇతర ఆధారాలను కూడా న్యాయస్థానం ముందుంచారు.
అయితే, ఈ ఆధారాల ప్రామాణికతను ప్రధాన పిటిషన్ విచారణ ముగింపు దశలోనే తేల్చగలమని పేర్కొంటూ ట్రయల్ కోర్టు భర్త పిటిషన్‌ను ప్రారంభంలోనే కొట్టివేసింది. మధ్యంతర జీవనభృతి నిర్ణయించే దశలో ఇలాంటి అంశాన్ని విచారించాలనే ప్రత్యేక నిబంధన చట్టంలో లేదని హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హిమాంశు చోర్డియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసును పరిశీలించిన ధర్మాసనం, కింది కోర్టుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. భర్త సమర్పించిన ఆధారాలు భార్య వివాహేతర సంబంధాన్ని ప్రాథమికంగా స్పష్టం చేస్తున్నప్పుడు, ఆ పిటిషన్‌ను ప్రారంభంలోనే తిరస్కరించడం సమంజసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
సెక్షన్ 125(4) నిబంధన ఉద్దేశ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వ్యభిచార బంధంపై ఉన్న ప్రాథమిక ఆధారాలను చివరి తీర్పు దశ వరకు పక్కన పెట్టడం వల్ల ఆ నిబంధన నిరుపయోగంగా మారుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టులు చేసిన పొరపాటును సరిదిద్దుతూ, భర్త వేసిన పిటిషన్‌ను చట్టపరమైన అర్హతల ఆధారంగా పునఃపరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపింది.







