రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ఈ తరానికి ఓపిక తక్కువ..
కీలక కేసులో సుప్రీం వ్యాఖ్యలు
సమాజంలో వస్తోన్న మార్పుల కారణంగానే ఈ మధ్య కాలంలో ‘హనీమూన్ హత్య’ లాంటి కేసులు వెలుగుచూస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తరం వాళ్లకు జ్ఞానం పెరుగుతున్నప్పటికీ.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని పేర్కొంది. అందుకే వారు మరింత బలహీనంగా మారుతున్నాయని తెలిపింది. సోనమ్ రఘువంశీ బెయిల్ అంశంపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
హనీమూన్‌లో భర్త రాజా రఘువంశీని హత్య (Honeymoon Murder) చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ రద్దు చేసింది. ఆమె మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలె ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మారుతున్న సమాజంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. నేటి తరానికి ఓపిక తక్కువ, చికాకు ఎక్కువ. వారు సమస్యలకు తక్షణ పరిష్కారాలను కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంటోంది. అందులో షేర్ అవుతున్న వాటిని నమ్మి దాన్నే జ్ఞానం అనుకుంటున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మేఘాలయ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘‘ఈ మధ్య హనీమూన్‌కు వెళ్తోన్న భర్తలు బాడీగార్డులను వెంట తీసుకెళ్తున్న కామెడీ రీల్స్ వస్తున్నాయి. భార్యాభర్తల బంధంలో ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం క్రమంగా క్షీణిస్తోంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఇలాంటి సమస్యను మెరుగ్గా పరిష్కరించేవి’’ అని పేర్కొన్నారు.
మెహతా వ్యాఖ్యలతో ఏకీభవించిన ధర్మాసనం.. ‘‘ఉమ్మడి కుటుంబంలో పెరిగినప్పుడు పెద్దవాళ్లను చూసి పిల్లలు సర్దుకుపోయే మనస్తత్వాన్ని నేర్చుకోగలుగుతారు. నిరాశను ఎలా జయించాలో తెలిసొస్తుంది. కానీ, నేడు అన్నీ చిన్న కుటుంబాలే. అలాంటి వాతావరణంలో పెరిగిన వారు చిన్న చిన్న వాటికే ఏడుస్తున్నారు. నచ్చినది దొరక్కపోతే విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య ఓ హోటల్‌లో చిన్నారి ఏడుస్తుంటే.. తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చి ఊరుకోబెట్టారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. భావోద్వేగాలను నియంత్రించాల్సిన సమయంలో గ్యాడ్జెట్లతో సర్దిచెప్తున్నారు’’ అని విచారం వ్యక్తం చేసింది.







