హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్లకు గల చట్టపరమైన హక్కులపై సుప్రీంకోర్టు కీలక స్పష్టతనిచ్చింది. పూర్వీకుల ఆస్తి, స్వార్జిత ఆస్తి అనే రెండు విభాగాల్లో కుమార్తె హక్కులను కోర్టు వివరించింది. ఈ తీర్పు నేపథ్యంలో వివాహిత కూతుళ్ల వారసత్వ హక్కులపై ఉన్న అనేక సందేహాలకు సమాధానం లభించినట్టైంది.

పూర్వీకుల ఆస్తి విషయంలో కుమార్తె హక్కు గురించి కోర్టు స్పష్టంగా పేర్కొంది. పుట్టుకతోనే కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా వాటా లభిస్తుందని, ఆమెను కూడా Coparcener గా పరిగణించాలనే విషయం చట్టం ప్రకారం అమలులో ఉందని స్పష్టం చేసింది. కూతురికి వివాహం అయినా, కాకపోయినా ఈ హక్కు మారదని, వివాహ స్థితి ఆధారంగా హక్కులను తగ్గించడం లేదా నిరాకరించడం చట్టబద్ధం కాదని కోర్టు తేల్చింది.

అలాగే సెప్టెంబర్ 9, 2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా, లేకపోయినా పూర్వీకుల ఆస్తిలో కుమార్తె తన వాటాను క్లెయిమ్ చేసుకునే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. అంటే ఆ తేదీకి ముందు తండ్రి మరణించినా, ఆ తర్వాత మరణించినా, కుమార్తె హక్కు సజీవంగానే ఉంటుందని, ఆమె వాటాను కోరుకునే అవకాశం చట్టం కల్పిస్తుందని స్పష్టం చేసింది.

స్వార్జిత ఆస్తి విషయంలో కూడా సుప్రీంకోర్టు హక్కులను వివరించింది. తండ్రి వీలునామా రాయకుండా మరణించిన సందర్భంలో, ఆయన స్వార్జిత ఆస్తిలో కొడుకులతో పాటు కూతురికీ సమాన వాటా దక్కుతుందని కోర్టు పేర్కొంది. అంటే తండ్రి పేరు మీద ఉన్న, ఆయన స్వయంగా సంపాదించిన ఆస్తి కూడా వారసత్వ చట్టం ప్రకారం కుమార్తెకు సమానంగా పంచబడాలి.

అయితే తండ్రి జీవించి ఉన్నప్పుడు తన స్వార్జిత ఆస్తిని తన ఇష్టపూర్వకంగా ఎవరికైనా Will ద్వారా రాసిస్తే, ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు వారసులకు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. తండ్రి స్వేచ్ఛా సంకల్పంతో చేసిన వీలునామాను చట్టం గౌరవిస్తుందని, ఆస్తి పంపిణీ విషయంలో ఆయన నిర్ణయమే తుది అని కోర్టు వ్యాఖ్యానించింది.

మొత్తం మీద ఈ తీర్పు హిందూ వారసత్వ చట్టం పరిధిలో కుమార్తె హక్కులను మరింత బలపరిచినట్టుగా న్యాయవర్గాలు భావిస్తున్నాయి. పూర్వీకుల ఆస్తి, స్వార్జిత ఆస్తి రెండింటిలోనూ కుమార్తెకు ఉన్న చట్టపరమైన హక్కులను స్పష్టంగా రుజువు చేసిన ఈ తీర్పు, కుటుంబ ఆస్తి వివాదాల పరిష్కారానికి మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.