₹2,000కు మించిన కొన్ని UPI P2M లావాదేవీలపై 0.4 శాతం MDR విధించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు కేంద్రం, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (RBI), నేషనల్ ప్రెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCI)లకు నోటీసులు జారీ చేసింది.

కొత్తగా ప్రతిపాదించిన UPI ఛార్జీల విధానంపై పూర్తి వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్త విధానం అమలు నేపథ్యం, దాని అవసరం, వినియోగదారులు, వ్యాపారులపై పడే ప్రభావం వంటి అంశాలపై కేంద్రం, RBI, NPCIలు అఫిడవిట్ రూపంలో సమగ్ర వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ₹2,000కు మించిన కొన్ని UPI పర్సన్-to-మర్చంట్ (P2M) లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించనున్నారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో, UPI లావాదేవీలపై ఛార్జీలు విధించడం వల్ల డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి భంగం కలుగుతుందని వాదించారు.

పిటిషనర్ వాదనలను విన్న అనంతరం, సుప్రీంకోర్టు ఈ విషయంపై కేంద్రం, RBI, NPCI అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావించింది. అందుకే సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేసి, నిర్దిష్ట గడువులోగా తమ తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

అయితే అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఛార్జీల విధానంపై స్టే ఇవ్వాలని పిటిషనర్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ దశలో విధానాన్ని నిలిపివేయడం సముచితం కాదని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణలో రెండు పక్షాల వాదనలు, సమర్పించబోయే అఫిడవిట్లను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.

UPI వ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉండటంతో, ఈ కేసు పరిణామాలపై బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొత్త MDR విధానం అమలులోకి వచ్చిన తర్వాత UPI ద్వారా జరిగే పెద్ద మొత్తాల వ్యాపార లావాదేవీలపై ప్రభావం ఉండే అవకాశముందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.