రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
మతం మారితే ఎస్సీ హోదా రద్దు..
రివ్యూ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
దిల్లీ: మతం మారిన వారికి ఎస్సీ హోదా వర్తింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుపై రివ్యూ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. గతంలో వెలువరించిన తన తీర్పులో ఎలాంటి లోపాలు లేవని, పునర్విమర్శ చేయాల్సిన అంశాలేమీ లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది మార్చి 24న ఇచ్చిన తీర్పు యథాతథంగా అమల్లో కొనసాగనుంది.
బాపట్ల జిల్లా పిట్లవాని పాలెం మండలం కొత్తపాలెంలో 2021లో చోటుచేసుకున్న ఘటన ఈ కేసుకు నేపథ్యంగా నిలిచింది. అక్కడి నివాసి చింతాడ ఆనంద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రార్థన ముగించుకుని వెళ్తున్న సమయంలో తనపై దాడి చేసి, కులం పేరుతో దూషించారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అక్కల రామిరెడ్డి సహా మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో తాను క్రైస్తవ మతస్థుడినని చింతాడ ఆనంద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ హోదా ఆధారంగా అట్రాసిటీ చట్టం వర్తించదని అక్కల రామిరెడ్డి న్యాయపోరాటం ప్రారంభించారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం స్వీకరిస్తే రాజ్యాంగపరంగా ఎస్సీ హోదా కొనసాగదని ఆయన వాదించారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. మతం మారిన తర్వాత ఆ వ్యక్తికి ఎస్సీగా కల్పించే రాజ్యాంగ పరిరక్షణలు, ప్రత్యేక హక్కులు అమల్లో ఉండవని హైకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని తిరస్కరించాలని, మతం మారినా ఎస్సీ హోదా కొనసాగాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 24న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తన నిర్ణయం వెలువరించింది.
ఈ తీర్పుపై పునర్విమర్శ కోరుతూ చింతాడ ఆనంద్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ధర్మాసనం తమ ముందస్తు తీర్పులో ఎలాంటి లోపాలు లేవని, రివ్యూ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో మతం మారిన వ్యక్తులకు ఎస్సీ హోదా వర్తించదన్న హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు అమల్లో కొనసాగనున్నాయి. బాపట్ల ఘటనకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, అందులో చింతాడ ఆనంద్ హోదాపై వచ్చిన న్యాయపరమైన వివాదానికి ఈ తీర్పు స్పష్టతనిచ్చినట్లైంది.







