రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: భోపాల్: నటి త్విశా శర్మ కేసులో కీలక సాక్షిగా ఉన్న నీరజ్ దూబేపై దాడి జరిగింది. నిందితుడు సమర్థ్ సింగ్ స్నేహితులు నీరజ్‌పై దాడి చేసినట్లు సమాచారం. మే 30న జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులకు నీరజ్ దూబే ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, సమర్థ్ సింగ్ ఇంటి సమీపంలోనే ఆయన సెలూన్ నడుపుతున్నాడు. త్విశా శర్మ కేసులో తనను కీలక సాక్షిగా గుర్తించడంతో సమర్థ్ సింగ్ స్నేహితులు తనను లక్ష్యంగా చేసుకున్నారని నీరజ్ పోలీసులకు తెలిపాడు. కోర్టులో సాక్ష్యం ఇవ్వొద్దని కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నాడు.
మే 30న తన సెలూన్ సమీపంలో ఉండగా ఐదుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి తనను చుట్టుముట్టారని నీరజ్ ఫిర్యాదులో వివరించాడు. వచ్చీరాగానే తనపై దుర్భాషలతో దాడి ప్రారంభించారని, తాను ప్రతిఘటించడానికి ప్రయత్నించగా విచక్షణారహితంగా కొట్టారని తెలిపాడు. త్విశా శర్మ కేసులో ఎందుకు కీలక సాక్షిగా మారావని ప్రశ్నిస్తూ, కోర్టులో సమర్థ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వొద్దని బెదిరించారని ఆయన పేర్కొన్నాడు.
దాడి అనంతరం వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు నీరజ్ దూబే తెలిపాడు. తన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నీరజ్‌కు భరోసా ఇచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి, నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఈ ఘటనపై నీరజ్ దూబే మీడియాతో మాట్లాడుతూ.. దాడితో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని చెప్పాడు. కాగా, త్విశా శర్మ కేసులో కీలక సాక్షిపై దాడి జరగడం పట్ల స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, నీరజ్‌కు తగిన రక్షణ కల్పించాలంటూ పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.







