రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తోంది. థియేటర్లలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను మాత్రమే రాబట్టుకున్నప్పటికీ, ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురభి, వెన్నెల కిషోర్, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. కుటుంబం మొత్తాన్ని కవర్ చేసే వినోదాత్మక అంశాలతో పాటు, ఫాంటసీ టచ్ కలిగిన కథతో ఈ సినిమా రూపొందింది.
కథ విషయానికి వస్తే.. మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) కుటుంబం తరాలుగా ‘రంభ ఊర్వశి మేనక’ డ్రామా కంపెనీని నడుపుతూ ఉంటుంది. వారి వద్ద ఓ మేజిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్‌పై సరిగ్గా ముగ్గు వేస్తే పైనుంచి రంభ, ఊర్వశి, మేనక దిగివచ్చి కోరికలన్నీ తీర్చేస్తారనే నమ్మకం ఆ కుటుంబంలో బలంగా ఉంటుంది.
ఆ మేజిక్ బుక్‌పైనే నమ్మకం పెట్టుకున్న ఈ కుటుంబం అప్పుల ఊబిలోకి జారిపోతుంది. కానీ ఎంత ప్రయత్నించినా రంభ, ఊర్వశి, మేనక మాత్రం దిగిరారు. చిన్నప్పటి నుంచీ హీరో కావాలనేది సూరి కల. అయితే ఆ లక్ష్యానికి తగిన ప్రయత్నాలు చేయకుండా, మేజిక్ బుక్ పేరు చెప్పి ఊరి వారందరి దగ్గరా అప్పులు చేస్తూ ఉంటాడు.
అలా ఊరి నిండా అప్పులు పెరిగిపోవడంతో సమస్యలు చుట్టుముడతాయి. ఇదిలా ఉండగా సూరి తల్లి తీవ్ర అనారోగ్యానికి గురై మంచం పడుతుంది. ఆమె ప్రాణాలు నిలుపుకోవాలంటే లక్షల్లో డబ్బు అవసరమని వైద్యులు చెబుతారు. ఏం చేయాలో అర్థం కాక ఇరుకులో పడిన సూరి మరోసారి మేజిక్ బుక్‌పై ముగ్గు వేస్తాడు.
అనూహ్యంగా ఆ బుక్ తెరుచుకుని పైనుంచి రంభ, ఊర్వశి, మేనక దిగివస్తారు. తర్వాత ఏమైంది? వాళ్లు నిజంగా సూరి కోరికలను తీర్చారా? కుటుంబం అప్పుల బారినుంచి బయటపడిందా? సూరి హీరో కావాలనే తన కలను సాధించుకున్నాడా? అనే అంశాలు చిత్రంలో ఆసక్తికరంగా నడుస్తాయి.
థియేటర్లలో చూసి మిస్సైన ప్రేక్షకులకు ఇప్పుడు ‘రంభ ఊర్వశి మేనక’ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది. కామెడీ, ఫాంటసీ అంశాలు కలగలిపిన చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓటీటీలో మరో వినోదంగా నిలుస్తోంది.






