నటి రేణు దేశాయ్ చాలా కాలం విరామం తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి థియేటర్‌ ద్వారా కాదు, నేరుగా ఓటీటీ ద్వారా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ వెబ్ ఎపిసోడ్ సెప్టెంబర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

రేణు దేశాయ్ నటించడంతో పాటు ఈ లఘు చిత్రానికి కథ, కథనం, సంభాషణలు కూడా ఆమెనే అందించడం విశేషం. రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘కాశీ మజిలీ’ లఘు చిత్రం సెప్టెంబర్ 13 ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ETV Winలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

ETV Win ప్రత్యేకంగా తీసుకొస్తున్న ‘కథాసుధ’ సిరీస్‌లో భాగంగా ఈ చిత్రం రూపొందింది. హృదయానికి హత్తుకునే కథలను అందించాలనే ఉద్దేశంతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో ‘కాశీ మజిలీ’ని ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

‘కొన్ని ప్రేమకథలకు మరో అవకాశం దక్కాలి’ అనే భావనతో, మలయాళ చిత్రం ‘చిన్న చిన్న ఆశై’ కథ ఆధారంగా ఈ సరికొత్త లఘు చిత్రాన్ని రూపొందించారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో చివరిసారిగా కనిపించిన రేణు దేశాయ్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ ప్రాజెక్ట్‌తో డిజిటల్ ఓటీటీ రంగంలోకి మళ్లీ అడుగుపెట్టారు.

ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో రేణు దేశాయ్ కేవలం నటిగా మాత్రమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ బాధ్యతలను కూడా స్వయంగా చేపట్టారు. పవిత్ర నగరం వారణాసి (కాశీ) ఘాట్‌ నేపథ్యంగా ఆధ్యాత్మికత, ప్రేమానుబంధాల థీమ్స్‌తో ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా సాగుతుంది.

దాదాపు 600కు పైగా ప్రకటన చిత్రాలను రూపొందించిన ప్రసిద్ధ యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జేకే ఆర్ట్స్ బ్యానర్‌పై జగదీష్ కుమార్ కాళ్లూరు ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రేణు దేశాయ్ సరసన యువ నటుడు శంకర్ ఇందుచూడన్ కథానాయకుడిగా నటించారు.

దివంగత లెజెండరీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతంలో రచించిన ఒక అద్భుతమైన పాటను ఈ సినిమాలో వినియోగించడం ఈ చిత్రానికి మరో హైలెట్‌గా నిలిచింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చొని ETV Winలో ‘కాశీ మజిలీ’ని ఆస్వాదించవచ్చు.