ప్రభుత్వ వైద్య సేవలకు అనధికారికంగా దూరంగా ఉన్న 43 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. గరిష్టంగా నాలుగేళ్ల వరకు విధులకు హాజరుకాకుండా ఉన్న ఈ వైద్యులకు నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి, అభియోగాలు నమోదు చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో కఠిన చర్యలకు దిగినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మంది వైద్యులు కూడా అనధికారిక గైర్హాజరీ కారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల నుంచి తప్పించబడ్డారని మంత్రి గుర్తుచేశారు. ఇదే విధంగా ఇప్పుడు డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులపై కూడా చర్యలు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. వీరిలో జనరల్ మెడిసిన్ , ఆర్థో , జినిక్ తదితర విభాగాల వైద్యులు ఉన్నట్లు సమాచారం.

అధికారుల వివరాల ప్రకారం, మొత్తం 118 మంది పర్మినెంట్ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాది కంటే ఎక్కువ కాలం అనధికారిక గైర్హాజరీ కొనసాగితే, సంబంధిత ఉద్యోగిని విధుల నుంచి తొలగించే అవకాశం ఉంది. ఈ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించగా, అందులో భాగంగా 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది.

ఈ 43 మందికి అదనంగా మరో 34 మంది వైద్యులు సంజాయిషీ నోటీసులు, అభియోగాల నమోదు అనంతరం రాజీనామాలు సమర్పించారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు సూచిస్తున్నాయి. అభియోగాలు నమోదు చేసిన తర్వాత రాజీనామాలు చేసిన మిగిలిన 19 మంది వైద్యులపై క్రమశిక్షణ చర్యల కోసం CCA రూల్స్ -1991 ప్రకారం జిల్లాల వారీగా 11 మంది విచారణ అధికారులను నియమించారు.

ఈ విచారణ అధికారులు సంబంధిత వైద్యుల నుంచి వివరణలు కోరనున్నారు. వారు సమర్పించే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు తెలిపారు. అభియోగాలు నమోదు అనంతరం మరో 19 మంది వైద్యులు వ్యక్తిగత కారణాల వల్ల విధులకు హాజరుకాలేదని తమ వివరణల్లో పేర్కొన్నారని, ఈ అంశంపై కూడా విచారణ జరగనున్నట్లు ఆయన వివరించారు.

సంజాయిషీ నోటీసులు జారీ చేసిన తర్వాత 9 మంది CASలు తిరిగి విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. మరో 13 మంది వైద్యుల అభ్యర్థనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, నిబంధనల ప్రకారం వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ వైద్య సేవల బలోపేతం, ప్రజలకు నిరంతర వైద్య సేవల అందుబాటు దృష్ట్యా అనధికారిక గైర్హాజరీపై కఠిన వైఖరిని కొనసాగించాలని వైద్య, ఆరోగ్య శాఖ సంకేతాలు ఇస్తోంది.