ఏపీ జెన్‌కోను బలోపేతం!

విద్యుత్ అంతరాయాల నివారణకు గట్టి చర్యలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల జాప్యంపై కాంట్రాక్టర్లతో సమీక్షించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. జనవరి - జూన్ మధ్య థర్మల్ ప్లాంట్ల పీఎల్‌ఎఫ్ 80 శాతానికి పైగా నమోదు అయ్యిందని.. గత ప్రభుత్వ హయాంలో పీఎల్‌ఎఫ్ 45 - 50 శాతం మధ్యే ఉండేదని మంత్రి వ్యాఖ్యానించారు.

థర్మల్ కేంద్రాల్లో కనీసం 15 రోజుల బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఏపీ జెన్‌కోను బలోపేతం చేసి స్వీయ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలన్నారు. విద్యుత్ కొనుగోళ్లు తగ్గించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు బీఈఎస్‌ఎస్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. విద్యుత్ రంగ సేవలపై ప్రజల్లో మరింత సంతృప్తి పెరిగేలా అధికారులు పనిచేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.