విశ్వేశ్వరరెడ్డి, గోరంట్ల యాదవ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలకు నిరసనగా నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని విశ్వేశ్వరరెడ్డి తాజాగా వీడియోలో వెల్లడించారు.

అయితే, విడపనల్ మండలం వేల్పుమడుగులో వైఎస్సార్‌సీపీ నేత గోవింద్‌కు చెందిన 21 ఎకరాల భూమిని ఆలయ భూమిగా టీడీపీ, బీజేపీ నేతలు పేర్కొంటున్నారని, అయితే ఆ భూమి ప్రైవేటు భూమేనని రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేశారని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఆ భూమికి సంబంధించి హైకోర్టు కూడా వైఎస్సార్‌సీపీ నేతకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

కాగా, మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడి కారణంగా హైకోర్టు ఆదేశాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అమలు చేయడం లేదని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఉరవకొండలో ధర్నాకు పిలుపునిచ్చినట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అయితే ధర్నాకు వస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్ సందర్భంగా పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి బలవంతంగా పోలీసులు లాక్కెళ్లారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.