రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రభుత్వ నిధులతో ఇబ్బంది ఉంటే సీఎస్‌ఆర్‌ నిధులు, వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో రెండవ రోజు పేదలకు పట్టాల పంపిణీ చేపట్టారు. ‘మన ఇల్లు.. మన లోకేశ్‌’ పేరిట కార్యక్రమం నిర్వహించారు.

రెండు రోజుల్లో 3,000 మందికి పట్టాల పంపిణీ చేశారు. ప్రజలు కొండవాలు ప్రాంతాలు, అటవీ భూములు, దేవాలయ భూముల్లో ఇల్లు నిర్మించుకొని దశాబ్దాలుగా నివసిస్తున్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలతో పట్టాలు పంపిణీ చేశారు. దేశం మొత్తం నిడమర్రు పాఠశాల గురించి మాట్లాడుకోవడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా లోకేశ్‌ అన్నారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100పడకల ఆసుపత్రి, నీటి సమస్య ఇలా అన్నింటికీ రెండేళ్లలోనే పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. మంగళగిరి ప్రజలు ఓడించారనే కసితో ఇంకా బాగా పనిచేశానన్నారు. ప్రతిపక్షంలో ఉండగా 29 సంక్షేమ పథకాలు సొంత నిధులతో అమలు చేసి, అధికారం ఇస్తే ఇంకెలా చేస్తానోనని భరోసా కల్పించానని లోకేశ్‌ చెప్పారు.