భూములకు శాశ్వత భద్రత..

‘మీ భూమి- బ్లాక్‌చెయిన్‌’ పైలట్ ప్రాజెక్టును సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఆస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు అమలుకానుంది. ఈ మండలాల్లో రీసర్వే పూర్తయిన 89 గ్రామాల్లోని 1,37,763 పార్సెల్‌ మ్యాప్‌లు ప్రాజెక్టు పరిధిలోకి రానున్నాయి. 

పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ రికార్డులు సరిగా లేకపోవడంతో విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో భూ వివాదాలు పెరిగాయని చెప్పారు. ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్‌’ వ్యవస్థతో భూములకు శాశ్వత భద్రత దక్కుతుందన్నారు. బ్లాక్‌చెయిన్‌ ద్వారా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు ఒకే వేదికపైకి వస్తాయని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు చేసుకోవచ్చన్నారు. నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.