రూ.2,506 కోట్ల వ్యయంతో ఆరు ప్రాజెక్టులు

రాష్ట్రంలో రహదారి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

అమరావతి : రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారి అభివృద్ధి కోసం ఇప్పటివరకు సుమారు రూ.750 కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. అసంపూర్ణంగా ఉన్న 13 వంతెనలను పూర్తిచేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించామని చెప్పారు.

రాష్ట్రంలో పిపిపి మోడల్‌లో భారీ రహదారి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 405 కిలోమీటర్ల మేర రూ.2,506 కోట్ల వ్యయంతో ఆరు ప్రాజెక్టులను పిపిపి విధానంలో చేపట్టినట్లు వివరించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆధునిక ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని తెలిపారు.

రోడ్ల నాణ్యత, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి చెప్పారు. రహదారుల డ్యామేజ్‌ను గుర్తించేందుకు డిజిటల్ డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. రహదారుల నాణ్యత పెంచేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని, సాధారణంగా నాలుగేళ్లు మన్నే రోడ్లు ఇప్పుడు 7–8 ఏళ్లు నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జాతీయ రహదారుల విస్తరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో ఉందని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ తర్వాత అత్యధిక రహదారి పనులు ఏపీలోనే కొనసాగుతున్నాయని వివరించారు. కొత్త రహదారి ప్రాజెక్టుల కోసం రూ.7,784 కోట్లను ఖర్చు చేస్తుండగా, మరో రూ.30,780 కోట్ల విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. అదనంగా రూ.18 వేల కోట్లతో 79 కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఆగిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కుప్పం, శ్రీకాకుళం, అమరావతి సహా నాలుగు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. పోర్టుల అభివృద్ధితో రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రాష్ట్ర ప్రగతిని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసకర పాలన వల్ల రోడ్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. పనులు ఇవ్వకుండా, బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఆత్మహత్యలకు కూడా నెట్టిన విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అదే అరాచక పాలన కొనసాగిస్తామని ప్రతిపక్షం మాట్లాడుతోందని విమర్శించారు.

గత రెండేళ్లలో సుమారు రూ.3 వేల కోట్ల నిధులు మంజూరు చేసి రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను ప్రారంభించడంతో పాటు వాటిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 400 కిలోమీటర్ల మేర రహదారి పనులను రూ.439 కోట్ల వ్యయంతో చేపట్టినట్లు వివరించారు. నాణ్యతా ప్రమాణాలు, కొత్త టెక్నాలజీతో రోడ్లు వేయడంతో పాటు వాటి మెయింటెనెన్స్ బాధ్యతను కూడా కాంట్రాక్టు సంస్థలకే అప్పగించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.