రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. మహిళల కబడ్డీ ఫైనల్‌లో భారత్, ఇరాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత జట్టు 37-34 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత మహిళల కబడ్డీ జట్టు నాలుగోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఫైనల్ ఆరంభం నుంచే భారత మహిళలు దూకుడుగా ఆడి ఆధిక్యం సాధించారు. ఫస్ట్ హాఫ్‌లోనే భారత్ స్పష్టమైన లీడ్‌ను నమోదు చేసింది. రైడర్లు, డిఫెండర్లు సమన్వయంతో ఆడి ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే సెకండాఫ్‌లో ఇరాన్ జట్టు బలంగా తిరిగి పోటీలోకి వచ్చింది. వరుస పాయింట్లు సాధిస్తూ భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది.
మ్యాచ్ చివరి నిమిషాల వరకు స్కోరు తేడా చాలా తక్కువగానే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. కీలక సమయాల్లో IND రైడర్లు చెలరేగి వరుసగా పాయింట్లు సాధించారు. చివరికి మూడు పాయింట్ల తేడాతో భారత్ గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయంతో మహిళల కబడ్డీ విభాగంలో భారత్ ఆధిపత్యం మరోసారి రుజువైంది.
ఏషియన్ గేమ్స్‌లో మహిళల కబడ్డీ ప్రారంభమైనప్పటి నుంచి భారత్ నిరంతరం బలమైన జట్టుగానే కొనసాగుతోంది. ఈసారి కూడా లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు భారత జట్టు స్థిరమైన ప్రదర్శన కనబరిచింది. ఇరాన్‌తో ఫైనల్ పోరులో కొన్ని దశల్లో ఒత్తిడి వచ్చినా, అనుభవం, శాంత స్వభావంతో భారత ఆటగాళ్లు మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు.
మహిళల విభాగంలో స్వర్ణం ఖాయం చేసిన భారత్, ఇప్పుడు మెన్స్ కబడ్డీ ఫలితాలపై దృష్టి సారించింది. మెన్స్ టీమ్ కూడా ఇరాన్ మెన్స్ టీమ్‌తో ఈరోజు ఫైనల్‌లో తలపడనుంది. ఈ పోరులోనూ భారత్ విజయం సాధిస్తే, కబడ్డీ విభాగంలో డబుల్ గోల్డ్ సాధించిన ఘనత భారత జట్టుకు దక్కనుంది.







