ఫిఫా ప్రపంచ కప్‌ 2026 టోర్నమెంట్‌ కీలక దశకు చేరుకుంది. ఈసారి మొత్తం 48 జట్లు ప్రధాన పోటీలో బరిలోకి దిగగా, లీగ్‌ దశ, రౌండ్‌ ఆఫ్‌ 32 మ్యాచ్‌ల అనంతరం 16 జట్లు మాత్రమే ప్రిక్వార్టర్స్‌ దశకు అర్హత సాధించాయి. ఇకపై ప్రతి మ్యాచ్‌ నాకౌట్‌ విధానంలో జరగనుండటంతో జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠగా మారనుంది.

లీగ్‌ దశలో, రౌండ్‌ ఆఫ్‌ 32లో ప్రతిభ కనబరచిన జట్లు మాత్రమే ప్రిక్వార్టర్స్‌ వరకు ప్రయాణం కొనసాగించాయి. ఈ దశ వరకు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన జట్లను ఏ ఒక్కదానినీ తక్కువగా అంచనా వేయలేమని ఫుట్‌బాల్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కాబో వెర్డ్‌ జట్టు సంచలన ప్రదర్శనతో నాకౌట్‌ దశకు చేరుకుని చరిత్ర సృష్టించింది. అయితే రౌండ్‌ ఆఫ్‌ 32లో అర్జెంటీనాతో జరిగిన పోరులో ఓటమి పాలైంది.

ప్రిక్వార్టర్స్‌ దశలో గెలిచే జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి సెమీఫైనల్స్‌, ఆపై ఫైనల్‌ వరకు ప్రయాణం కొనసాగుతుంది. చివరకు జూలై 20న జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో విజేత జట్టు ప్రపంచ కప్‌ను ఎత్తిపట్టనుంది. ఈ నేపథ్యంలో రౌండ్‌ ఆఫ్‌ 16లో ఏ జట్టు ఎవరితో తలపడనుందో, భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ల సమయాలు ఎలా ఉన్నాయో ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రిక్వార్టర్స్‌ దశలో జట్ల పోటీలు, భారత కాలమానం ప్రకారం సమయాలు ఇలా ఉన్నాయి:

కెనడా VS మొరాకో: జూలై 4 (రాత్రి 10.30 గంటలకు)

పరాగ్వే VS ఫ్రాన్స్‌: జూలై 5 (తెల్లవారుజామున 2.30 గంటలకు)

బ్రెజిల్‌ VS నార్వే: జూలై 6 (తెల్లవారుజామున 1.30 గంటలకు)

మెక్సికో VS ఇంగ్లాండ్‌: జూలై 6 (ఉదయం 5.30 గంటలకు)

పోర్చుగల్‌ VS స్పెయిన్‌: జూలై 6 (అర్ధరాత్రి 12.30 గంటలకు – తెల్లవారితే జూలై 7)

అమెరికా VS బెల్జియం: జూలై 7 (ఉదయం 5.30 గంటలకు)

అర్జెంటీనా VS ఈజిప్ట్‌: జూలై 7 (రాత్రి 9.30 గంటలకు)

స్విట్జర్లాండ్‌ VS కొలంబియా: జూలై 8 (తెల్లవారుజామున 1.30 గంటలకు)

జూలై 10 నుంచి 12 వరకు క్వార్టర్‌ ఫైనల్స్‌ జరగనున్నాయి. జూలై 15న తొలి సెమీఫైనల్‌, జూలై 16న రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. మూడో స్థానానికి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ను జూలై 19న నిర్వహించనున్నారు. ఆపై జూలై 20న ఫిఫా ప్రపంచ కప్‌ 2026 ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

ప్రిక్వార్టర్స్‌ దశలోనే బలమైన జట్లు ఒకదానితో ఒకటి తలపడుతున్న నేపథ్యంలో, ఈ దశలోనే కొన్ని అగ్ర జట్లు టోర్నమెంట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, ఇప్పటి వరకు అంచనాలకు అందని జట్లు చూపించిన ప్రతిభను కొనసాగిస్తాయా, లేక సంప్రదాయ బలగాలు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటాయా అన్నది చూడాలి.