భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలోనూ ఇకపై కెప్టెన్‌గా కొనసాగబోనని ఆమె స్పష్టం చేశారు. అయితే క్రీడాకారిణిగా మాత్రం మరికొంతకాలం టీమిండియాకు సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.

సుదీర్ఘకాలం భారత మహిళల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన హర్మన్‌ప్రీత్ ఈ నిర్ణయాన్ని మంగళవారం ఇంస్టాగ్రామ్ లో చేసిన సుదీర్ఘ పోస్టు ద్వారా వెల్లడించారు. సారథిగా తన కర్తవ్యం పూర్తయిందని, ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని ఆటపై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత మహిళల జట్టు ఇటీవలే 2026 ఆసియన్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్ లో జరిగిన ఈ క్రీడల్లో మహిళల క్రికెట్ విభాగంలో టీం ఇండియా శ్రీ లంక పై ఘన విజయం సాధించి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. అంతకుముందు 2025 Women’s ODI వరల్డ్ కప్ ను కూడా భారత్ ఆమె సారథ్యంలోనే గెలుచుకుంది.

కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తనకు అంత సులభమైన నిర్ణయం కాదని హర్మన్‌ప్రీత్ ఇంస్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు ఉన్నాయని ఆమె వివరించారు. భారత మహిళల క్రికెట్‌లో తన నాయకత్వ ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోందని ఆమె భావించారు.

హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్‌కు 2025 Women’s ODI వరల్డ్ కప్ , 2026 ఆసియన్ గేమ్స్ గోల్డ్ మాత్రమే కాకుండా మరెన్నో విజయాలు లభించాయి. 2012, 2016, 2022లో Women’s ఆసియ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. అంతకుముందు 2022 ఆసియన్ గేమ్స్ లోనూ మహిళల క్రికెట్ విభాగంలో భారత్ గోల్డ్ మెడల్ ను సాధించింది.

ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ తన బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టేందుకు అవకాశం లభించనుంది. జట్టుకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన ఆమె శకం నాయకత్వ పరంగా ముగిసినా, కీలక బ్యాటర్‌గా టీమిండియాకు ఆమె సేవలు కొనసాగనున్నాయి. భారత మహిళల క్రికెట్‌లో ఆమె నాయకత్వం అందించిన విజయాలు, స్థిరత్వం, పోరాట స్పూర్తి జట్టుకు మరింత ప్రేరణగా నిలిచాయి.