వన్డే వరల్డ్ కప్ 2027 సన్నాహకాల్లో భాగంగా టీమ్ ఇండియా ఆడబోయే తొలి వన్డే సిరీస్‌కు వర్షం అడ్డంకిగా మారింది. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా నిలిచింది. అయితే అక్కడ మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైంది.

షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు టాస్ నిర్వహించాలి. 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా నిర్ణీత సమయానికి టాస్ వేయలేకపోయారు. మైదానం తడిగా ఉండటంతో గ్రౌండ్ సిబ్బంది కవర్లు వేసి పిచ్‌ను రక్షిస్తున్నారు. వర్షం ఆగిన వెంటనే మైదానాన్ని ఆడేందుకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఇక ఓవర్లలో కోత విధించే సమయ పరిమితి కూడా ప్రారంభమైంది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరగాలంటే సాయంత్రం 6.32 గంటలలోపు ఆట మొదలవ్వాలి. ఆ సమయానికి ముందే వర్షం ఆగి, మైదానం సిద్ధమైతేనే మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించి నిర్వహించే అవకాశం ఉంటుంది. లేకపోతే తొలి వన్డే రద్దు కావాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఈ వన్డే సిరీస్ టీమ్ ఇండియాకు ప్రాధాన్యమైనదిగా భావిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా జట్టు సమీకరణలు, కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫార్మ్‌ను ఈ సిరీస్‌లోనే అంచనా వేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేకంగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాబోయే వన్డే వరల్డ్ కప్ వరకు అతడు ఫిట్‌గా కొనసాగగలడా, జోరుమీదున్న యువ ఆటగాళ్లతో పోటీపడి పరుగులు సాధించగలడా అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అలాగే తరచూ గాయాలతో ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడన్నది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

వచ్చే ఏడాది వరకూ భారత జట్టు దాదాపు 25 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో, ఈ కాలంలోనే వరల్డ్ కప్‌కు తుది జాబితాను ఖరారు చేయాల్సి ఉంటుంది. అందుకే అఫ్గానిస్థాన్ సిరీస్‌లో తమ ప్రతిభను నిరూపించుకోవడం టీమ్‌లో చోటు కోసం పోటీపడుతున్న ఆటగాళ్లకు కీలకంగా మారింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ దెబ్బతింటే, సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేల ప్రాధాన్యం మరింత పెరగనుంది.