రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జూడో చరిత్ర:
అస్మితా దే, హర్షసింగ్‌లకు స్వర్ణాలు
గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత జూడో క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. మహిళల 48 కిలోల విభాగంలో అస్మితా దే స్వర్ణ పతకం సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడో పోటీల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ అందించిన క్రీడాకారిణిగా నిలిచారు. అదే సమయంలో పురుషుల 60 కిలోల విభాగంలో హర్షసింగ్ కూడా స్వర్ణం సాధించడంతో భారత్ పతకాల ఖాతా మరింత బలపడింది.
గ్లాస్గోలో జరిగిన మహిళల 48 కిలోల ఫైనల్ పోరులో అస్మితా దే, కెనడాకు చెందిన హెయిడీ క్వాచ్ను ఉత్కంఠభరితంగా ఓడించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇద్దరు క్రీడాకారిణులు అత్యంత జాగ్రత్తగా, సమసమంగా పోరాడారు. ఒక దశలో కెనడా క్రీడాకారిణి యూకో పాయింట్‌తో ఆధిక్యం సాధించగా, అస్మితా వెంటనే పుంజుకుని ప్రతిగా యూకో పాయింట్ సాధించి స్కోరును 1-1తో సమం చేశారు.
నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరువురు క్రీడాకారిణులు సమవుజ్జీలుగా నిలవడంతో మ్యాచ్ గోల్డెన్ స్కోర్ విధానానికి దారితీసింది. సడన్ డెత్ తరహాలో సాగిన ఈ దశలో ఒత్తిడిని జయించిన అస్మితా, సరైన సమయాన్ని అందిపుచ్చుకుని మరో యూకో పాయింట్ సాధించారు. దీంతో భారత్‌కు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జూడో స్వర్ణ పతకం ఖాయం అయింది. కామన్వెల్త్ గేమ్స్ జూడో చరిత్రలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అస్మితా దే పేరు నిలిచింది.
అస్మితా విజయం భారత జూడోకు కొత్త దిశను చూపిందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆమె చూపిన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని తట్టుకుని కీలక సమయంలో పాయింట్ సాధించే సామర్థ్యం దేశానికి గర్వకారణంగా మారాయి. ఇదే సెషన్లో పురుషుల 60 కిలోల విభాగంలో హర్షసింగ్ కూడా అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం గెలుచుకున్నారు.
ఇప్పటి వరకు భారత్ సాధించిన స్వర్ణ పతకాలలో అస్మితా దే (జూడో), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), షర్మిల ధాన్కర్ (పారా అథ్లెటిక్స్), దిలీప్ మహదు గావిత్ (పారా అథ్లెటిక్స్), హర్షసింగ్ (జూడో) ఉన్నారు. రజత పతకాల జాబితాలో రిషికాంత సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్, లవ్‌ప్రీత్ సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్), సర్వేష్ కుషారే, గుల్వీర్ సింగ్, ఎం. శ్రీశంకర్ (అథ్లెటిక్స్) నిలిచారు.
కాంస్య పతకాల విషయానికి వస్తే సీమా కలిరామ్నా, బింద్యారాణి దేవి, శిల్ప కె. షైలా, ఝండూ కుమార్ భారత్‌కు పతకాలు అందించారు. మొత్తం గా భారత్ ఇప్పటివరకు 5 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 19 పతకాలు సాధించి, పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.







