రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మహిళల ఆసియా కప్ చరిత్రలో భారత్ ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది.
184 పరుగుల లక్ష్యఛేదనకు శ్రీలంక జట్టు ప్రయత్నించినా భారత బౌలర్ల ముందు తట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 111 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ చమరి ఆటపట్టు 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. నీలాక్షిక 22, విష్మి గుణరత్నె 20 పరుగులు చేశారు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.
భారత బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీ చరణి 4 వికెట్లు (4/20) తీసి శ్రీలంక బ్యాటింగ్‌ను చిత్తు చేసింది. దీప్తి శర్మ 3 వికెట్లు (3/19) పడగొట్టి కీలక పాత్ర పోషించింది. క్రాంతి గౌడ్, షెఫాలీ వర్మ, ప్రేమ రావత్ తలో వికెట్ తీశారు. బౌలింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో భారత్ విజయం సులభం చేసింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 183/5 భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్‌తో శ్రీలంక బౌలర్లను ఇబ్బందుల్లోకి నెట్టారు. షెఫాలీ 68, స్మృతి 59 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు.
ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 77 బంతుల్లో 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీ కారణంగా భారత్ పెద్ద స్కోరు దిశగా దూసుకెళ్లింది. తరువాత రిచా ఘోష్ 17, హర్మన్‌ప్రీత్ కౌర్ 14 పరుగులు చేసి స్కోరు మరింతగా పెంచారు. శ్రీలంక బౌలర్లలో మిథాలీ అయోధ్య, చమరి ఆటపట్టు, ప్రబోధ తలో వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా శ్రీ చరణి ఓ ప్రత్యేక రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచింది. 2026లో ఆమె మొత్తం 39 వికెట్లు పడగొట్టి, 2018లో 35 వికెట్లు తీసిన పూనమ్ యాదవ్ రికార్డును అధిగమించింది.
మహిళల ఆసియా కప్ ఇప్పటివరకు 10 సార్లు నిర్వహించగా, అందులో ఎనిమిది సార్లు భారత్ విజేతగా నిలవడం విశేషం. 2004, 2005-06, 2006, 2008, 2012, 2016, 2022, 2026 ఎడిషన్లలో టీమ్ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. 2018లో బంగ్లాదేశ్, 2024లో శ్రీలంక టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. తాజా విజయం ద్వారా ఆసియా కప్‌లో భారత్ ఆధిపత్యం మరింత బలపడింది.







